మూడో టెస్టుకు తమ తుది జట్టులోకి ఎవరిని తీసుకోవాలో ఇంకా తేల్చలేదని ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్ తెలిపాడు. అందుకు ఇంకాస్త సమయం పడుతుందని పేర్కొన్నాడు.
"మొతేరా పిచ్‌తో పాటు పింక్ బాల్ టెస్టు గురించి మాకు తగినంత అవగాహన లేదు. అందుకే తుది జట్టులోకి ఎవరిని తీసుకోవాలనేది ఇంకా నిర్ణయించలేదు. వీలైనంత త్వరగా జట్టును ప్రకటిస్తాం. బౌలింగ్ విభాగంలో ఆర్చర్ గాయం నుంచి కోలుకోవడం శుభపరిణామం. అతడు ప్రపంచ స్థాయి ఆటగాడు. అన్ని నైపుణ్యాలున్న బౌలర్. జోఫ్రా రాకతో బౌలింగ్‌లో సమతూకం ఏర్పడుతుంది."
-జో రూట్, ఇంగ్లాండ్ కెప్టెన్.
ఆటగాళ్ల రొటేషన్ పాలసీలో భాగంగా రెండో టెస్టుకు దూరమైన అండర్సన్ తిరిగి టీమ్‌కు అందుబాటులోకి వచ్చాడు. గాయం కారణంగా చెన్నై టెస్టులో ఆడలేకపోయిన జోఫ్రా ఆర్చర్.. ఫిట్నెస్ సాధించాడు. వీరితో పాటు స్టువర్ట్ బ్రాడ్ కూడా పోటీలో ఉన్నాడు. వీరి ముగ్గురిలో ఎవరిని తుది జట్టులోకి తీసుకోవాలనేది రూట్‌కు తలనొప్పిగా మారింది.
సీనియర్ వికెట్ కీపర్, బ్యాట్స్‌మెన్ జానీ బెయిర్ స్టో.. తిరిగి స్క్వాడ్‌లోకి వచ్చాడు. ఇప్పటికే జట్టులో ఉన్న బెన్ ఫోక్స్‌ను ఆడించాలా? లేదా బెయిర్ స్టోకు అవకాశమివ్వాలా? అనే సందిగ్ధం ఇంగ్లాండ్ టీమ్‌లో ఏర్పడింది.
పిచ్‌పై స్పష్టత వచ్చాక జట్టును ప్రకటిస్తామని ఇంగ్లిష్ సారథి పేర్కొన్నాడు. ఈ రోజు రాత్రి ప్రాక్టీస్ సెషన్ తమకు కొంత మేర ఉపయోగపడుతుందని తెలిపాడు. తర్వాతి రోజు బంతి ఎలా స్పందిస్తుందనేది ఓ అవగాహన వస్తుందని.. దాన్ని బట్టి టీమ్‌లో ఎవరెవరు ఉండాలనేది నిర్ణయిస్తామని రూట్ వెల్లడించాడు.
ఇదీ చదవండి:మొతేరా పిచ్‌పై కోహ్లీ అంచనాలు ఇలా...