వెస్టిండీస్ ఆల్‌రౌండర్ ఆండ్రూ రసెల్ కన్నా టీమ్‌ఇండియా బ్యాట్స్‌మన్ హార్దిక్ పాండ్యా మెరుగైన ఆటగాడని వెటరన్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ అభిప్రాయపడ్డాడు. ఆదివారం ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టీ20లో పాండ్యా(42*; 22 బంతుల్లో 3x4, 2x6) మెరుపు బ్యాటింగ్ చేసి టీమ్‌ఇండియాను గెలిపించాడు. ఈ నేఫథ్యంలో భజ్జీ స్పందించాడు.
"హార్దిక్‌కు ఎప్పటి నుంచో నైపుణ్యం ఉంది. అతడు భారీ సిక్సులు కొడతాడనే విషయం మాకు ముందు నుంచే తెలుసు. అయితే, ఇప్పుడు నిలకడగా ఆడుతున్నాడు. క్రీజులో నిలదొక్కుకొని మ్యాచ్‌లను పూర్తి చేసే బాధ్యతను తెలుసుకున్నాడు. పాండ్యా రోజురోజుకూ ఆత్మవిశ్వాసం పెంచుకుంటున్నాడు. టీమ్ఇండియాకు అతడే సరైన ఫినిషర్. అతడు రసెల్ లాంటి ఆటగాడు. అయితే ఈ విండీస్ ఆల్‌రౌండర్ కంటే పాండ్యానే కొంత ఉత్తమం. అవసరమైనపుడు సిక్సులు బాదుతూనే, టెక్నిక్‌తో సింగిల్స్ తీయగల సమర్థుడు. ఎవరిని ఎప్పుడు లక్ష్యంగా చేసుకోవాలో పాండ్యాకు తెలుసు. అతడిని ఫినిషర్‌గా చూడటం ఆనందంగా ఉంది."