అంతర్జాతీయ క్రికెట్లో ఇక మహేంద్రసింగ్ ధోని కనిపించడు. అభిమానులకు నిరాశ కలిగిస్తూ అనూహ్యంగా ఆటకు టాటా చెప్పేశాడు. మహీ సుదీర్ఘ కెరీర్‌లో ఎన్నో ఉజ్వల ఘట్టాలు.. మరెన్నో మెరుపులు! అతడి కెరీర్‌లో ఎన్నో ఆసక్తికర విశేషాలు ఉన్నాయి. అవేంటో చూద్దాం.
బైక్, కార్లపై మోజు..
స్టేడియంలో బైక్‌పై ధోనీ షికార్లు ధోనీకి ద్విచక్ర వాహనాలు, కార్లంటే పిచ్చి ప్రేమ. వివిధ సందర్భాల్లో మైదానంలో బైక్, కార్లపై అతడు తిరిగిన దృశ్యాలు మనం చూశాం. వీలు దొరికినప్పుడల్లా బైక్ తీసుకుని రాంచి వీధుల్లోనూ షికార్లు కొడుతుంటాడు. మహీ దగ్గర అత్యాధునిక ద్విచక్రవాహనాలు, కార్లు ఉన్నాయి. ఫెరారీ, ఆడి లాంటి విలాసవంతమైన కార్లు.. కవాసకి నింజా హెచ్2, హార్లీ డేవిడ్‌సన్ లాంటి ఖరీదైన బైక్‌లు దగ్గరున్నాయి.
సుశాంత్‌తో స్నేహం..
తన బయోపిక్‌లో హీరోగా నటించిన దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పూత్‌తో ధోనికి మంచి స్నేహం ఏర్పడింది. ధోనీని దగ్గర నుంచి గమనించడం కోసం సుశాంత్.. అతనితో కలిసి కొన్ని రోజులు గడిపాడు. ధోని నడక, బ్యాటింగ్ విధానం.. ఇలా అన్నింటినీ దగ్గర నుంచి పరిశీలించాడు. అందుకే ఆ సినిమాలో సుశాంత్ అంత బాగా నటించగలిగాడు. సినిమాలో చూస్తుంది సుశాంత్‌నా లేదా ధోనీనా అనే అనుమానం కలిగేలా చేశాడు. ఇటీవల అతను ఆత్మహత్య చేసుకోవడం వల్ల ధోనీ ఎంతో బాధపడ్డాడని సన్నిహితులు తెలిపారు.
బిర్యాని మహాఇష్టం..
39 ఏళ్లు వచ్చినప్పటికీ ధోని ఎంతో ఫిట్‌గా కనిపిస్తాడు. కాని బిర్యానీని చాలా ఇష్టంగా లాగిస్తాడు... తాజా పండ్ల రసాలు, ప్రొటీన్ షేక్‌లు తాగుతాడు.
సాక్షితో ప్రేమాయణం: ధోనీ, సాక్షి చిన్నప్పటి నుంచే ఒకరికొకరు తెలుసు. వాళ్ల నాన్నలు ఒకే చోట పనిచేసేవాళ్లు. వాళ్లు రాంచీలో ఒకే పాఠశాలకు వెళ్లేవాళ్లు. కొన్నాళ్లకు సాక్షి కుటుంబం దేహ్రాదూన్‌కు వచ్చేయడం వాళ్ల మధ్య దూరం పెరిగింది. దాదాపు దశాబ్దకాలం తర్వాత వాళ్లిద్దరూ కోల్‌కతాలోని ఓ హోటల్లో అనుకోకుండా కలిశారు. ఆ హోటళ్లోనే సాక్షి అప్పుడు తాత్కాలికంగా పనిచేసింది. ఆ తర్వాత ఫోన్లో మాట్లాడుకుని దగ్గరైన ఆ ఇద్దరి మధ్య ప్రేమ చిగురించి అది పెళ్లికి దారితీసింది.
కరోనా మాస్కులు కావు.. 2007లో హైదరాబాద్‌లో ,,ఓ యాడ్ షూటింగ్‌లో మహీ, యువరాజ్ ఇలా. తెలుగు రాష్ట్రాల్లో
ధోనీకి హైదరాబాద్‌తో మంచి అనుబంధమే ఉంది. ఇక్కడి ఉప్పల్ స్టేడియంలో అతను రెండు ఐపీఎల్ ఫైనళ్లు (2017లో రైజింగ్ పుణె సూపర్‌జెయింట్స్ తరపున, 2019లో సీఎస్కే కెప్టెన్‌గా) ఆడాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో ఇక్కడే మూడు టెస్టులాడి 131 పరుగులు చేశాడు. ఐదు వన్డేల్లో 202 పరుగులు చేశాడు. మరోవైపు విశాఖపట్నంతో ధోనీకి ప్రత్యేక అనుబంధం ఉంది. ప్రపంచ క్రికెట్లో తన ప్రస్థానానికి నాంది పడింది ఇక్కడే అని చెప్పుకోవచ్ఛు. వైఎస్సార్ ఏసీఏ- వీడీసీఏ స్టేడియంలో పాకిస్థాన్‌తో జరిగిన వన్డేలో చెలరేగిన ధోనీ ప్రపంచానికి తన సత్తా చాటాడు. 123 బంతుల్లో 148 పరుగులు చేసి వన్డేల్లో తొలి శతకాన్ని నమోదు చేశాడు.
దాదా.. ఇదిగో..
2007లో శ్రీలంకపై సిరీస్ సాధించిన అనంతరం విశాఖపట్నంలో 'మ్యాన్ ఆఫ్ ద సిరీస్' గంగూలీపై షాంపైన్‌ను చిమ్ముతున్న ధోనీ
మెరుపు స్టంపింగ్స్: బ్యాటింగ్ చేస్తున్న ఆటగాడు క్రీజులో నుంచి కాలు బయటపెట్టాడో అంతే సంగతి. ధోనీ చేతిలో ఉన్న బంతి రెప్పపాటులో వికెట్లను ఎగరేసేది. వికెట్ కీపర్‌గా అద్భుత నైపుణ్యాలు సొంతం చేసుకున్న అతడు స్టంపింగ్‌లను మెరుపు వేగంతో చేసేవాడు. మైక్రో సెకన్ల తేడాతో బెయిల్స్‌ను ఎగరగొట్టి బ్యాట్స్‌మెన్‌ను పెవిలియన్ చేర్చిన సందర్భాలు ఎన్నో. బ్యాట్స్‌మెన్ కూడా ఎన్నోసార్లు అతడి వేగాన్ని నమ్మలేనట్లుగా చూశారు.
ధోనీ-డీఆర్‌ఎస్
సమీక్ష తీసుకోవాలంటే అందరూ ధోనీ వైపే చూసేవాళ్లు. దాంతో నిర్ణయ సమీక్ష పద్ధతి (డీఆర్‌ఎస్) కాస్త ధోనీ సమీక్ష పద్ధతిగా మారిపోయింది. వికెట్ల వెనకాల ఉంటూ బ్యాట్స్‌మన్‌ను జాగ్రత్తగా గమనించి అతను ఔట్ అయ్యాడో లేదో అనే చెప్పే విషయంలో ధోనీ పట్టు సాధించాడు. తాను బ్యాటింగ్ చేసే సమయంలోనైనా అంపైర్ ఔట్ అని పూర్తిగా చేయి ఎత్తకముందే ధోనీ డీఆర్‌ఎస్ కోరడాన్ని మనం చూశాం.
సరదాగా కాదు...
ఆర్మీలో గౌరవ లెఫ్టినెంట్ కల్నల్ హోదాలో ఉన్న ధోనీ.. పారా జంప్ చేసిన తొలి క్రీడాకారుడిగా నిలిచాడు. 2015 ఆగస్టులో అతడు మిలిటరీ ఎయిర్‌క్రాఫ్ట్ నుంచి పారా జంప్ చేశాడు. ఏదో సరదా కోసం కాకుండా ప్రత్యేక శిక్షణ పొంది ఆ విన్యాసాన్ని పూర్తి చేశాడు. పారా రెజిమెంట్ విభాగంలో శిక్షణలో భాగంగా, 15వేల అడుగుల ఎత్తు నుంచి పారా జంప్ చేశాడు.
పారా గ్లైడింగ్‌కు సిద్ధమవుతున్న ధోనీ