వన్డే ప్రపంచకప్-2011 సెమీఫైనల్లో భారత్ చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌పై విజయం సాధించి ఫైనల్‌కు చేరుకుంది. ఆ మ్యాచ్‌లో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ తెందూల్కర్ (85; 115బంతుల్లో 11x4) బాధ్యతాయుతంగా ఆడి టీమ్‌ఇండియాకు గౌరవప్రదమైన స్కోర్ అందించాడు. అయితే ఈ క్రమంలో సచిన్ నాలుగుసార్లు ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. తాజాగా నాటి విశేషాల్ని అప్పటి భారత పేసర్ ఆశిష్ నెహ్రా గుర్తు చేసుకున్నాడు. సచిన్ చెలరేగిన ఆ ఇన్నింగ్స్‌ను కొనియాడాడు.
"సచిన్ అత్యుత్తమ ఇన్నింగ్స్‌ల్లో అది ఒకటి. ‘ఇప్పుడు ఆ విషయం చెప్పాల్సిన అవసరం లేకున్నా.. చెబుతున్నా. ఆ మ్యాచ్‌లో పలుమార్లు ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు మాస్టర్. ఆ రోజు సచిన్ ఎంత అదృష్టవంతుడో అతడికీ తెలుసు. ప్రపంచకప్‌లో ఒత్తిడి ఉంటుంది. ఏ జట్టు సెమీస్‌కు చేరినా అది గొప్ప జట్టే’.అయితే, ఆటగాళ్లు ఒత్తిడిని జయించడమే ముఖ్యం."