పుణె వేదికగా టీమ్ఇండియాతో జరిగిన రెండో వన్డేలో ఇంగ్లాండ్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. పర్యటక బ్యాట్స్‌మెన్ ధాటికి సిక్సర్ల వర్షం కురిసింది. బంతి పడితే చాలు బౌండరీ దాటాల్సిందే అన్నట్టు సాగింది ఇంగ్లీష్ ఆటగాళ్ల విధ్వంసం. భారత బౌలర్లలో ప్రసిధ్ క్రిష్ణ 2, భువనేశ్వర్ కుమార్ ఒక వికెట్ తీసుకున్నారు. ఈ గెలుపుతో మూడు వన్డేల సిరీస్‌ను 1-1తో సమం చేసింది ఇంగ్లాండ్. చివరిదైన మూడో వన్డే ఆదివారం(మార్చి 28న) జరగనుంది.
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కోహ్లీ సేన నిర్ణీత 50 ఓవర్లలో 336 పరుగుల భారీ స్కోరు చేసింది. భారత ఆటగాళ్లలో కేఎల్ రాహుల్ శతకంతో రాణించగా.. కెప్టెన్ విరాట్ కోహ్లీ, యువ బ్యాట్స్‌మెన్ రిషభ్ పంత్ అర్ధ సెంచరీలు చేశారు. ఇంగ్లాండ్ బౌలర్లలో టామ్ కరన్, తోప్లే చెరో రెండు వికెట్లు తీసుకున్నారు.
అనంతరం 337 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్‌కు మంచి ఆరంభం లభించింది. తొలి నుంచే 6 రన్‌రేట్‌తో పరుగులు సాధించిన పర్యటక జట్టు.. మొదటి వికెట్‌కు 110 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది. లేని రన్‌కు ప్రయత్నించి.. ఓపెనర్ రాయ్ వెనుదిరిగాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన బెన్ స్టోక్స్.. బెయిర్ స్టోకు సహకారం అందించాడు.