తెలంగాణ

telangana

ETV Bharat / sports

'యాషెస్​': 258 పరుగులకే కుప్పకూలిన ఇంగ్లాండ్ - england

లార్డ్స్​ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న యాషెస్​ సిరీస్​ రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్​లో ఇంగ్లాండ్ 258 పరుగులకు ఆలౌటైంది. ఆసీస్​ బౌలర్లు కమిన్స్​, హాజిల్​వుడ్, లైయన్ తలో మూడు వికెట్ల తమ ఖాతాలో వేసుకున్నారు. రెండో రోజు ముగిసే సమయానికి ఆసీస్ స్కోరు 30/1.

యాషెస్​

By

Published : Aug 16, 2019, 8:39 AM IST

Updated : Sep 27, 2019, 3:57 AM IST

యాషెస్​ సిరీస్​ తొలి టెస్టులో ఆస్ట్రేలియా చేతిలో ఘోరపరాభవం మూటగట్టుకున్న ఇంగ్లాండ్​ రెండో టెస్టులోనూ సత్తాచాటలేకపోయింది. లార్డ్స్​ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్​లో 258 పరుగులకే ఆలౌటైంది ఆతిథ్య జట్టు. టాస్​ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఆసీస్​.. ఇంగ్లీష్ జట్టును కట్టడి చేసింది. ఇంగ్లాండ్​ బ్యాట్స్​మెన్స్​ బర్న్స్​(53), జానీ బెయిర్​ స్టో (52) మినహా మిగతావారు పెద్దగా ఆకట్టుకోలేకపోయారు. కంగారూ బౌలర్లలో కమిన్స్ హాజిల్​వుడ్​, లయన్ తలో మూడు వికెట్లతో రాణించారు.

ముందు బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ ఖాతా తెరవకుండానే ఓపెనర్ జేసన్​ రాయ్ వికెట్ కోల్పోయింది. హాజిల్​వుడ్​ బౌలింగ్​లో బాన్​క్రాఫ్ట్​కు క్యాచ్​ ఇచ్చాడు రాయ్​. కాసేపటికే కెప్టెన్​ రూట్(14)​నూ పెవిలియన్ చేర్చాడు హాజిల్​వుడ్​. ఈ పరిస్థితుల్లో డిన్లై(30) - బర్న్స్​(53) ఇన్నింగ్స్​ను గాడిలో పెట్టే ప్రయత్నం చేశారు. వీరిద్దరూ 64 పరుగులు జోడించారు.

పరిస్థితి కుదుట పడుతుందనుకున్న తరుణంలో మళ్లీ వికెట్ల పతనం ప్రారంభమైంది. హాజిల్​వుడ్​కు కమిన్స్, లయన్​ తోడవ్వడంతో 138కే ఆరు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది ఇంగ్లీష్ జట్టు. చివర్లో బెయిర్​ స్టో, క్రిస్​ వోక్స్(30)​ క్రీజులో పాతుకుపోవడం వల్ల ఇంగ్లాండ్​ ఆ మాత్రం స్కోరైనా సాధించింది.

అనంతరం.. తొలి ఇన్నింగ్స్ బ్యాటింగ్​ ఆరంభించిన ఆసీస్​ రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఓ వికెట్ కోల్పోయి 30 పరుగులు చేసింది. ఆరంభంలోనే డేవిడ్ వార్నర్ వికెట్ కోల్పోయినప్పటికీ బాన్​క్రాఫ్ట్​, ఖవాజా నిలకడగా ఆడే ప్రయత్నం చేస్తున్నారు. వర్షం కారణంగా తొలి రోజు మ్యాచ్​ జరగలేదు.

ఇది చదవండి: 'గేల్.. ఓ స్నేహశీలి.. మంచి వ్యక్తి'

Last Updated : Sep 27, 2019, 3:57 AM IST

ABOUT THE AUTHOR

...view details