టీమ్ఇండియా మాజీ క్రికెటర్ రాహుల్ ద్రవిడ్‌పై ప్రశంసల వర్షం కురిపించాడు టెస్టు స్పెషలిస్టు చెతేశ్వర్ పుజారా. ఆయన నుంచి తాను ఎంతగానో స్ఫూర్తి పొందినట్లు తెలిపాడు. తన జీవితంపై మిస్టర్ డిపెండబుల్ ప్రభావం చాలా ఉందని వెల్లడించాడు.
ముఖ్యంగా క్రికెట్లో ఓ దశకు చేరుకున్నాక అందులో నుంచి వైదొలగడం ఎంత ముఖ్యమో ద్రవిడ్ తెలిసేలా చేశాడని వివరించాడు పుజారా. వ్యక్తిగత, వృత్తి పరమైన జీవితాలను ఎలా వేరుగా చూడాలో వివరణాత్మకంగా తెలియచెప్పాడని వెల్లడించాడు. అనంతరం క్రికెట్‌కు మించిన ఓ జీవితం ఉందని గుర్తుపెట్టుకోవాలని సూచించినట్లు తెలిపాడు. అందుకని ద్రవిడ్‌కు జీవితకాలం రుణపడి ఉంటానని చెప్పుకొచ్చాడు.
"క్రికెట్ నుంచి బయటకు రావడమనేది ఎంత ముఖ్యమో ద్రవిడ్ అర్థమయ్యేలా వివరించాడు. నాకు దానిపై కొంచెం అవగాహన ఉన్నప్పటికీ.. పూర్తి స్థాయిలో స్పష్టత వచ్చేలా తెలియజేశాడు. సీనియర్ క్రికెటర్లు వ్యక్తిగత, వృత్తి పరమైన జీవితాలను ఎలా వేరుగా ఉంచుతారో నాకు తెలుసు. అలా ఉంచడం ఎంతో ముఖ్యమని భావిస్తాను. క్రికెట్‌కు మించిన ఓ జీవితం ఉంది. "