ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో చెన్నై జట్టు రాణించడానికి కారణాలను విశ్లేషించాడు భారత మాజీ క్రికెటర్ రాహుల్ ద్రవిడ్. ఆ జట్టు సారథి ధోనీ ఆలోచనా విధానం, స్మార్ట్ గేమ్ సహా తెరవెనుక ఆ జట్టు పడే కష్టమే విజయాలకు కారణమని చెప్పాడు. బీసీసీఐ మాజీ అధ్యక్షుడు ఎన్.శ్రీనివాసన్‌తో కలిసి ఓ వెబ్‌నార్‌లో పాల్గొన్న ద్రవిడ్.. పలు ఆసక్తికర విషయాలు వెల్లడించాడు.
"సీఎస్కే విజయాలను చూడండి. వారు మంచి డేటాను సంపాదించుకోగలిగారు. తెరవెనుక బోలెడంత మంది పనిచేస్తారు. జూనియర్ స్థాయిలో వారు క్రికెట్ జట్లనూ నడిపిస్తారు. ప్రతిభను అర్థం చేసుకున్న వారు కచ్చితంగావాటిని ఉపయోగించుకోగలుగుతారు. అందుకు సారథి నిర్ణయాలు, ఆలోచనలు చాలా కీలకం. ధోనీ గురించి నాకు బాగా తెలుసు. డేటా, గణాంకాలను ధోనీ పెద్దగా పట్టించుకోడు. ఎప్పటికీ అలాగే ఉంటాడని అనుకుంటున్నా" అని ద్రవిడ్ చెప్పాడు.
ఇప్పటికే ఐపీఎల్ మూడుసార్లు టైటిల్‌ను సొంతం చేసుకుంది చెన్నై సూపర్‌కింగ్స్. పది సీజన్లలోనూ నాకౌట్లో అడుగుపెట్టిన ఏకైక జట్టుగా ఘనత సాధించింది.