టీమ్‌ఇండియా మాజీ సారథి మహేంద్రసింగ్ ధోనీ నిన్న(ఆగస్టు 15) అర్ధాంతరంగా అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. దీంతో అభిమానులు ఎంతో బాధపడుతున్నారు. మరోవైపు ఈ వార్త తెలియగానే దేశంలోని ప్రముఖులు అతడి సేవలను ప్రశంసిస్తూ ట్వీట్లు పెడుతున్నారు.
15 ఏళ్లపాటు టీమ్‌ఇండియాకు ఎనలేని విజయాలు అందించడమే కాకుండా తన ఆటతో ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచాడని మెచ్చుకుంటున్నారు. ఈ క్రమంలోనే ధోనీ సతీమణి సాక్షి సింగ్ కూడా తన భావాలను పంచుకున్నారు.
'నువ్వేం సాధించావో దాని పట్ల గర్వంగా ఉండాలి. ఆటకు అత్యుత్తమ సేవలు అందించినందుకు అభినందనలు. నీ విజయాల పట్ల, నీ వ్యక్తిత్వం పట్ల గర్వపడుతున్నా. నీకు ఎంతో ఇష్టమైన ఆటకు వీడ్కోలు పలకడమంటే కచ్చితంగా కంటతడి పెట్టి ఉంటావని నాకు తెలుసు. ఇకపై నువ్వు ఆరోగ్యంగా, సంతోషంగా ఉంటూ మరిన్ని గొప్ప విషయాలను ఆస్వాదించాలని కోరుకుంటున్నా'అని సాక్షి పోస్టు పెట్టారు.
'నువ్వేం చెప్పావో, ఏం చేశావో అనే విషయాలు ప్రజలు మర్చిపోయినా, వాళ్లని నువ్వెలా మైమరపించావ్ అనే విషయాన్ని ఎప్పటికీ మర్చిపోరు' అని అమెరికన్ రచయిత మాయా ఏంజిలో మాటలను కూడా దీనికి జోడించారు.
ధోనీ అంతర్జాతీయ క్రికెట్‌కు దూరమయ్యాడు కానీ మరో నెల రోజుల్లో ప్రారంభమయ్యే ఐపీఎల్‌లో ఆడనున్నాడు. అందుకోసం ఇప్పటికే చెన్నైకు చేరుకున్నాడు. ఫిట్‌నెస్ క్యాంప్‌లోనూ పాల్గొంటున్నాడు. ఈ క్రమంలోనే నిన్న రాత్రి రిటైర్మెంట్ ప్రకటించాడు.