ఈ ఏడాది ఐపీఎల్‌లో సత్తా చాటాలని భారత ఆటగాళ్లు సురేశ్ రైనా, అంబటి రాయడు సాధన మొదలుపెట్టారు. ఐపీఎల్‌లో వీరిద్దరు చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే)కు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. క్రికెట్‌కు ఎంతో కాలం దూరంగా ఉన్న వీరిద్దరు మైదానంలో కలిసి శ్రమిస్తున్నారు. 13వ ఐపీఎల్ సీజన్ ఆరంభానికి ఇంకా రెండు నెలల సమయం ఉండటం వల్ల ఇప్పటి నుంచే సాధన మొదలుపెట్టారు. దీనికి సంబంధించిన చిత్రాన్ని సీఎస్‌కే తన ట్విట్టర్లో పోస్ట్ చేసింది. "చిన్న తాలా, బాహుబలి తిరిగొచ్చేశారు" అని ట్వీట్ చేసింది.
రైనా చివరిగా గత ఏడాది మే 12న క్రికెట్ మ్యాచ్ ఆడాడు. ముంబయి ఇండియన్స్‌తో జరిగిన ఫైనల్ మ్యాచే అతడికి ఆఖరిది. మరోవైపు రాయుడు కూడా క్రికెట్‌కు ఎంతో కాలం నుంచి దూరంగా ఉన్నాడు. జులైలో రిటైర్మెంట్ ప్రకటించిన అతడు ఆ తర్వాత తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నాడు.
అనంతరం విజయ్ హజారే, సయ్యద్ ముస్తాఫ్ అలీ టోర్నమెంట్స్‌లో పాల్గొన్నాడు. హైదరాబాద్ బోర్డులో అవినీతి జరుగుతోందని ఆరోపించిన అతడు రంజీ మ్యాచ్‌లకు దూరంగా ఉన్నాడు.