కరోనా(కోవిడ్ 19) మహమ్మారి కారణంగా ఐపీఎల్ వాయిదాపడింది. దీంతో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ.. స్వస్థలం రాంచీకి శనివారం పయనమయ్యాడు. అందుకు సంబంధించిన వీడియోలను పలువురు అభిమానులు ట్విట్టర్లో పంచుకున్నారు.
ఈనెల 29న మొదలు కావాల్సిన ఐపీఎల్.. వచ్చే నెల 15 వరకు వాయిదా వేస్తున్నట్లు బీసీసీఐ ఇంతకు ముందే ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే చెన్నై ఫ్రాంఛైజీ తమ ప్రాక్టీస్ సెషన్‌ను ఆపేసింది. కెప్టెన్ ధోనీ సహా అంబటి రాయుడు, సురేశ్‌రైనా మరికొందరు ఆటగాళ్లు, చెన్నైను వీడి తమ ఇళ్లకు శనివారం పయనమయ్యారు.
అంతకుముందు జట్టు యాజమాన్యం ధోనీకి చిన్న వీడ్కోలు కార్యక్రమం ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా చెపాక్ స్టేడియంలో అభిమానులతో కాసేపు సరదాగా గడిపాడు మహీ. కొందరికి ఆటోగ్రాఫ్‌లు ఇచ్చి ఫొటోలు దిగాడు. ఈ వీడియోను చెన్నై సూపర్ కింగ్స్ ట్విటర్‌లో పంచుకుంది. 'తలా' మళ్లీ చెన్నైకు రావాలంటే ఐపీఎల్ నిర్వహణపై స్పష్టత రావాల్సిందే.
భారత్‌లో కరోనా వైరస్ రోజురోజుకు తీవ్ర ప్రభావం చూపిస్తోంది. ఇప్పటికే సుమారు 100 మంది వరకు వైరస్ బారిన పడ్డారు. ఇద్దరు మృతి చెందారు. ఈ కారణంతోనే దేశంలోని అన్ని క్రీడా టోర్నీలు ఉన్నపళంగా రద్దయ్యాయి. మరోవైపు వైరస్ కట్టడికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నాయి.