మే30 నుంచి వన్డే ప్రపంచకప్ ప్రారంభంకాబోతోంది. ఈ మెగా టోర్నీలో ఆడాలని ప్రతి ఆటగాడు కలలు కంటాడు. అదే కల నిజమైతే అతడి ఆనందానికి అవధులుండవు. ప్రస్తుత ప్రపంచకప్‌లోనూ తొలిసారిగా ఆడుతూ తమ సత్తా చాటడానికి ఉవ్విళ్లూరుతున్న యువ క్రికెటర్లను ఓసారి చూద్దాం.
బుమ్రా (భారత్)
కొంత కాలంగా భారత జట్టు పేస్ బౌలింగ్‌లో సంచలనంగా మారిన పేరు బుమ్రా. ప్రతి సిరీస్‌లోనూ స్థిరమైన ప్రదర్శన చేస్తూ జట్టులో కీలక ఆటగాడిగా మారాడు. వన్డే ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. 2018లో 13 వన్డేలాడి 16.63 సగటుతో 22 వికెట్లు తీశాడు. ఎకానమీ 3.62 ఉండటం విశేషం. డెత్ ఓవర్లలో యార్కర్లతో సత్తాచాటగలడు. మ్యాచ్‌లో ఏ దశలోనైనా వికెట్లు తీస్తూ గేమ్ ఛేంజర్‌గా పేరుగాంచాడు.
ఈ ఏడాది ఐపీఎల్లో ముంబయి ఇండియన్స్ ప్రధాన బౌలర్‌గా ఉన్న బుమ్రా.. తనపై ఉన్న అంచనాలకు తగ్గట్టు రాణించాడు. మొత్తం 15 మ్యాచ్‌ల్లో 23.23 సగటుతో 17 వికెట్లు తీశాడు. ఎకానమీ 6.84 గా ఉంది.
వన్డే బౌలర్లలో అగ్రస్థానంలో బుమ్రా
హెట్మియర్ (వెస్టిండీస్)
తక్కువ సమయంలోనే వెస్టిండీస్ మిడిలార్డర్లో మంచి ప్రదర్శనతో ప్రపంచకప్ జట్టులో చోటు సంపాదించాడు. 25 వన్డేలు ఆడిన ఈ యువఆటగాడు 40.86 సగటుతో 900 పరుగులకు చేరువగా ఉన్నాడు. ఇందులో నాలుగు శతకాలు ఉండడం గమనార్హం. 2015-16 అండర్-19 ప్రపంచకప్ ఈ ఆటగాడి సారథ్యంలోనే గెలిచింది విండీస్. 2018లో 18 వన్డేలు ఆడి 727 పరుగులు సాధించాడు.
ఐపీఎల్ 12వ సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున ఆడిన హెట్మియర్ ఐదు మ్యాచ్‌లు ఆడి 90 పరుగులు సాధించాడు. ఇందులో ఓ అర్ధశతకం ఉండటం విశేషం. సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో జట్టును గెలుపు తీరాలకు చేర్చాడు.
బాబర్ అజాం (పాకిస్థాన్)
ఫాస్ట్ బౌలర్లకు పెట్టింది పేరుగా పాకిస్థాన్ జట్టును చెప్పవచ్చు. కానీ రెండేళ్లుగా బ్యాటింగ్‌లో సత్తా చాటుతూ ప్రపంచవ్యాప్తంగా పేరు సంపాదించుకున్నాడు బాబర్ అజాం. 2015లో అరంగేట్రం చేసిన ఈ కుడిచేతి బ్యాట్స్‌మెన్ 59 మ్యాచ్‌ల్లో 51.29 సగటుతో 2,500 పరుగులు సాధించాడు. ప్రస్తుతం వన్డే ర్యాంకింగ్స్‌లో ఏడో స్థానంలో కొనసాగుతున్నాడు. పాక్ జట్టులో అత్యుత్తమ బ్యాట్స్‌మెన్‌గా ఎదుగుతున్న బాబర్ ప్రపంచకప్ పోరులో సత్తాచాటాలని భావిస్తున్నాడు.
రషీద్ ఖాన్ (అప్గనిస్థాన్)
20 ఏళ్ల వయసులో తన స్పిన్ బౌలింగ్‌తో క్రికెట్ అభిమానులను ఆకట్టుకుంటున్న ఆటగాడు రషీద్ ఖాన్. ఆడేది చిన్న దేశం తరఫునైనా ప్రపంచవ్యాప్తంగా పేరు గాంచాడు. 2015లో అరంగేట్రం చేసిన ఈ యువ స్పిన్నర్ 57 వన్డేలాడి 123 వికెట్లు దక్కించుకున్నాడు. బంతితోనే కాకుండా బ్యాట్‌తోనూ అద్భుత ప్రదర్శన చేయగలడు. ప్రస్తుతం వన్డే ఆల్‌రౌండర్ల విభాగంలో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.
ఐపీఎల్లో సత్తాచాటడం ద్వారా వెలుగులోకి వచ్చిన రషీద్ ఈ సీజన్లోనూ మెరుగైన ప్రదర్శన కనబర్చాడు. మొత్తం 15 మ్యాచ్‌లు ఆడి 22.70 సగటుతో 17 వికెట్లు సాధించాడు. ఎకానమీ 6.58 గా ఉంది. అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లలో ఏడో స్థానంలో ఉన్నాడు.
ఆల్రౌండర్లలో రషీధ్ ఖాన్ టాప్
వీరే కాకుండా ప్రపంచకప్ ఆస్ట్రేలియా జట్టులో స్థానం సంపాదించిన జే రిచర్డ్సన్ కూడా మంచి ప్రదర్శన కనబర్చగలడు. మొదటిసారి మెగాటోర్నీలో సత్తాచాటాలకున్న ఈ యువ ఆటగాడు గాయం కారణంగా దూరమయ్యాడు.