కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను వణికిస్తున్న నేపథ్యంలో భారత క్రికెట్ జట్టు శ్రీలంక పర్యటనను వాయిదా వేసుకుంది. ఈ విషయాన్ని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ట్విట్టర్లో వెల్లడించింది. కరోనా విజృంభిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో భారత క్రీడాకారులను శ్రీలంక పర్యటనకు పంపడం సాధ్యం కాదంటూ బీసీసీఐ శ్రీలంక క్రికెట్ బోర్డుకు తెలిపినట్టు సమాచారం. శ్రీలంకతో జూన్-జులైలో మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడేందుకు టీమ్ఇండియా వెళ్లాల్సి ఉంది. అయితే, తాజాగా నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ఈ పర్యటన వాయిదా పడినట్టు ఐసీసీ తెలిపింది. ఈ విషయాన్ని బీసీసీఐ కోశాధికారి అరుణ్ ధుమాల్ ధ్రువీకరించారు.
"జూన్-జులైలో శ్రీలంక పర్యటనకు భారత్ వెళ్లాల్సి ఉంది. కానీ, ప్రస్తుత సంక్షోభ సమయంలో సిరీస్ నిర్వహించడం సాధ్యం కాదని ఓ నిర్ణయానికి వచ్చాం. అయితే ఈ టోర్నీని ఆగస్టులో నిర్వహించాలని యోచిస్తున్నాం".