క్రికెట్ అభిమానులు గతంలో ఇలాంటి పరిస్థితిని ఎన్నడూ అనుభవించి ఉండరు. మ్యాచ్‌కు వరుణుడు అడ్డంకిగా మారితేనే ఎంతో తపన పడేవారు.. ఇప్పుడు ఒక్క మ్యాచ్‌ను కూడా చూడలేకపోతున్నారు. మహమ్మారి కరోనా వైరస్ ధాటికి క్రీడా ప్రపంచమంతా ఇబ్బందులు ఎదుర్కొంటోంది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత మొదటిసారిగా ఇలాంటి పరిస్థితి ఏర్పడింది. ఐపీఎల్ మత్తులో మునిగితేలాలనుకున్న క్రికెట్ అభిమానుల ఆశలను కరోనా చిదిమేస్తోంది. అయితే మహమ్మారి విజృంభణ చూస్తుంటే మరో కొన్ని నెలల వరకు స్టేడియాలు తెరుచుకుంటాయో లేదోననే అనుమానాలు తలెత్తున్నాయి. ఈ నేపథ్యంలో అసలు షెడ్యూల్ ప్రకారం ఈ ఏడాది ఎన్ని మ్యాచ్‌లు ఉన్నాయో ఓ లుక్కేద్దాం.
ఐపీఎల్:
షెడ్యూల్ ప్రకారం ఇండియన్ ప్రీమియర్ లీగ్ మార్చి 29 నుంచి ప్రారంభం కావాల్సింది. కానీ పరిస్థితుల దృష్ట్యా దాన్ని ఏప్రిల్ 15కు వాయిదా వేశారు. అప్పటిలోగా పరిస్థితులు సద్ధుమణిగితేనే ఐపీఎల్‌ను అభిమానుల మధ్య నిర్వహిస్తారు. తీవ్రత తగ్గకపోతే ఐపీఎల్‌ను పూర్తిగా రద్దు చేసే అవకాశాలు లేకపోలేదు.
ఉమెన్స్ టీ20 ఛాలెంజ్:
మహిళల ఐపీఎల్ తరహాలోనే నాలుగు జట్లతో దేశంలో ఉమెన్స్ టీ20 ఛాలెంజ్‌ను నిర్వహిస్తున్నారు. కానీ, కరోనా ధాటికి ఈ ఏడాది టోర్నీ నిర్వహణపై సందేహాలు మొదలయ్యాయి.
ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్:
ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌కు కరోనా ఎఫెక్ట్ తగిలింది. షెడ్యూల్ ప్రకారం మార్చిలో శ్రీలంక- ఇంగ్లాండ్ రెండు టెస్టులు, జూన్‌లో ఇంగ్లాండ్- వెస్టిండీస్ మూడు టెస్టులు, జులై- ఆగస్టులో ఇంగ్లాండ్- పాకిస్థాన్ మూడు టెస్టులు, జులైలో వెస్టిండీస్- దక్షిణాఫ్రికా రెండు టెస్టులు ఆడాల్సి ఉంది.
అంతేకాకుండా జులైలోనే బంగ్లాదేశ్-శ్రీలంక మూడు టెస్టులు, ఆగస్టులో బంగ్లాదేశ్- న్యూజిలాండ్ రెండు టెస్టులు, నవంబర్-డిసెంబర్‌లో న్యూజిలాండ్-వెస్టిండీస్ మూడు టెస్టులు ఆడాల్సి ఉంది. ఇప్పటికే శ్రీలంక- ఇంగ్లాండ్ టెస్టులు వాయిదా పడ్డాయి. మిగిలిన వాటిపై కూడా కరోనా ప్రభావం ఉంది.