బయో బబుల్లో ఉండటం కష్టమే.. అయినప్పటికీ ఈ విధానం వల్ల టీమ్‌ఇండియాకు మాత్రం మేలే జరిగిందని కోచ్ రవిశాస్త్రి తెలిపాడు. ఆర్నెళ్ల నుంచి ఎవరూ ఊహించని విధంగా ఎందరో ఆటగాళ్లకు అవకాశాలు వచ్చాయని పేర్కొన్నాడు. మైదానంలోకి ప్రస్తుతం రెండు జట్లను పంపగల సత్తా భారత్ సొంతమని వెల్లడించాడు.
"టీమ్‌ఇండియాకు ఇంతమంది క్రికెటర్లు ఆడగలరని ఆర్నెళ్ల క్రితం ఎవరూ ఊహించలేదు. విదేశీ పర్యటనలకు భారీ బృందంగా వెళ్లడం వల్ల టీమ్‌ఇండియాకు మేలే జరిగింది. సాధారణంగా 17-18 మంది ఆటగాళ్లను విదేశీ పర్యటనలకు ఎంపిక చేస్తారు. బయో బబుల్, కరోనా ఆంక్షల వల్ల ఈ సారి 25-30 లేదా అంతకన్నా ఎక్కువమందితో వెళ్తున్నాం. దీంతో అత్యుత్తమ జట్టును ఎంపిక చేసేందుకు కూలంకషంగా ఆలోచించాల్సి వస్తోంది. అదృష్టమో, దురదృష్టమో మేం 30 మందితో ఆడాల్సి వచ్చింది. ఎవరు బాగా ఆడతారు ఎవరు ఆడరో తెలిసింది. ఈ విధానం బాగా పని చేసింది" అని రవిశాస్త్రి అన్నాడు.