రాంఛీలో భారత్ ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న మూడో వన్డేలో టీమిండియా ఓటమిపాలైంది. ముందుగా బ్యాటింగ్ చేసిన ఆసీస్ 313 పరుగులు చేసింది. అనంతరం 314 పరుగుల లక్ష్యంలో బరిలోకి దిగిన భారత్ జట్టుకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. 27 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.
రెండు మ్యాచ్‌ల్లోనూ విఫలమైన ఓపెనర్లు ఈ వన్డేలోనూ నిరాశపర్చారు. కేవలం ఒక పరుగు చేసి ధావన్ ఔటవగా రోహిత్ 14 పరుగుల వద్ద వికెట్ల ముందు దొరికిపోయాడు. అనంతరం వచ్చిన రాయుడు కూడా ఎక్కువసేపు నిలవలేదు. 2 పరుగులే చేసి పెవిలియన్ బాట పట్టాడు. ఈ దశలో క్రీజులోకి వచ్చిన ధోని కోహ్లీతో కలిసి భాగస్వామ్యాన్ని నెలకొల్పే ప్రయత్నం చేశాడు.
శతకం బాదిన కోహ్లీ
ఓ దశలో వికెట్లు కోల్పోతున్నా కోహ్లీ ఏ మాత్రం వెనకడుగు వేయలేదు. తనదైన శైలి ఆటతో రెచ్చిపోయాడు. స్టాయినిస్ బౌలింగ్లో సింగిల్‌తో అర్ధశతకాన్ని పూర్తి చేసుకున్నాడు. అనంతరం కాస్త స్పీడ్ పెంచాడు. 85 బంతుల్లో కెరీర్లో 41 శతకాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఆస్ట్రేలియాపై ఇది 8వ సెంచరీ. సచిన్ మాత్రమే 9 శతకాలతో కోహ్లీ కంటే ముందున్నాడు. రోహిత్ 7 శతకాలతో తర్వాత స్థానంలో ఉన్నాడు.
123 పరుగుల వద్ద జంపా బౌలింగ్లో కోహ్లీ ఔటవడంతో మరింత ఇబ్బందుల్లో పడింది టీమిండియా. భారత ఆటగాళ్లలో ధోని 26, కేదార్ జాదవ్ 26, విజయ్ శంకర్ 32 పరుగులు చేశారు.
ఆసీస్ అడ్డుకుంది
భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌కు ఆసీస్ బౌలర్లు చెమటలు పట్టించారు. కట్టుదిట్టమైన బౌలింగ్‌తో పరుగులు రాకుండా అడ్డుకుని బ్యాట్స్ మెన్‌పై ఒత్తిడి పెంచారు. ఆసీస్ బౌలర్లలో కమిన్స్, రిచర్డ్ సన్, జంపా తలో 3 మూడు వికెట్లు తీయగా లియోన్‌కు ఒక వికెట్ దక్కింది.
ఆస్ట్రేలియా ఓపెనింగ్ అదిరే..
టాస్ గెలిచిన టీమిండియా ప్రత్యర్థికి బ్యాటింగ్ అప్పగించింది. ఓపెనర్లు ఫించ్, ఖవాజా చెలరేగి ఆడి మొదటి వికెట్‌కు 193 పరుగులు జోడించి బలమైన పునాది వేశారు. ఫాంను అందుకోలేక తంటాలు పడుతున్న కెప్టెన్ ఫించ్ 93 పరుగులు చేసి కొద్దిలో సెంచరీ చేజార్చుకున్నాడు. మరో బ్యాట్స్‌మెన్ ఖవాజా 104 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. భారీ స్కోరు చేస్తుందనుకున్న ఆస్ట్రేలియా చివరి పది ఓవర్లలో 68 పరుగులు మాత్రమే చేయగలిగింది. మిగతా బ్యాట్స్‌మెన్‌లో షాన్ మార్ష్ 7, స్టాయినిస్ 13, క్యారీ పరుగులే చేయగలిగారు. హాండ్స్‌కాంబ్ డకౌట్‌గా వెనుదిరిగాడు.
భారత బౌలర్లలో కుల్దీప్ మూడు వికెట్లతో ఆకట్టుకోగా షమి ఒక వికెట్ దక్కించుకున్నాడు. విజయంత సిరీస్ ఆధిక్యాన్ని 2-1కి తగ్గించింది ఆసీస్.