తెలంగాణ

telangana

ETV Bharat / sports

'పరిమిత ఓవర్ల క్రికెట్‌ కోసం పరితపిస్తున్నా'

పరిమిత ఓవర్ల క్రికెట్​లోనూ ఆడాలన్న తనలోని ఆకాంక్షను వ్యక్తం చేశాడు టెస్టు స్పెషలిస్టు ఛెతేశ్వర్​ పుజారా. దీంతో పాటు.. ఆస్ట్రేలియా పర్యటనకు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు ఈ నయావాల్.

cheteshwar-pujara-says-he-still-have-desire-to-play-for-team-india-in-whiteball-cricket
'పరిమిత ఓవర్ల క్రికెట్‌ కోసం పరితపిస్తున్నా'

By

Published : Jan 29, 2021, 11:58 AM IST

టీమ్‌ఇండియా తరఫున పరిమిత ఓవర్ల క్రికెట్‌ ఆడాలనే ఆకాంక్ష బలంగా ఉందని టెస్టు స్పెషలిస్టు బ్యాట్స్‌మన్‌, నయావాల్‌ ఛెతేశ్వర్​ పుజారా తనలోని కోరికను బయటపెట్టాడు. ఆస్ట్రేలియా పర్యటనపై ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ తాజాగా ఈ వ్యాఖ్యలు చేశాడు. ఇటీవల ముగిసిన బోర్డర్‌-గావస్కర్‌ సిరీస్‌లో నయావాల్‌ ఎంత ముఖ్యమైన ఆటగాడో మరోసారి నిరూపించుకున్నాడు. ఈ సిరీస్‌కు తగిన ప్రాక్టీస్‌ లేకపోయినా పట్టుదలగా బ్యాటింగ్‌ చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.

'నాకింకా టీమ్‌ఇండియా తరఫున పరిమిత ఓవర్ల క్రికెట్‌ ఆడాలనే కోరిక బలంగా ఉంది. అందులో ఎలాంటి సందేహం లేదు. కానీ, అదే సమయంలో ఇతర ఆటగాళ్లు ఆడుతుంటే నాకా అవకాశం రాదు. ఇక ఆస్ట్రేలియా పర్యటనకు ముందు లాక్‌డౌన్‌లో సరైన మ్యాచ్‌ ప్రాక్టీస్‌ లేదు. అందువల్లే ఈ టోర్నీకి సన్నద్ధమవ్వడానికి ఇబ్బందులు పడ్డాను. ఒకవేళ ఈ కరోనా వైరస్‌ లేకపోతే ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌ మ్యాచ్‌‌లు ఆడేవాడిని. దాంతో మంచి ప్రాక్టీస్‌ లభించేది. ఈ సిరీస్‌కు ముందు ఒకే ఒక్క వార్మప్‌ మ్యాచ్‌ ఆడాను. తర్వాత మ్యాచ్‌లు ఆడేకొద్ది మునుపటి లయ అందుకోగలిగాను' అని పుజారా వివరించాడు.

కాగా, ఆసీస్‌తో టెస్టు సిరీస్‌లో పుజారా ఒక్కడికే సరైన ప్రాక్టీస్‌ లేదు. మిగతా ఆటగాళ్లంతా ఐపీఎల్‌ నుంచే కంగారూ గడ్డ మీద అడుగుపెట్టారు. గతేడాది న్యూజిలాండ్‌లో టెస్టు సిరీస్‌ పూర్తయ్యాక ఈ నయావాల్‌ ఇంటికి చేరుకున్నాడు. తర్వాత లాక్‌డౌన్‌ విధించడంతో దేశవాళీ క్రికెట్‌ కూడా జరగలేదు. ఈ నేపథ్యంలోనే అతడు నేరుగా బోర్డర్-గావాస్కర్‌ సిరీస్‌లో ఆడాడు. ఈ సందర్భంగా మూడు అర్ధశతకాలతో 271 పరుగులు చేసి టోర్నీలో టీమ్‌ఇండియా తరఫున రెండో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు. అంతకుముందు 2018-19 సిరీస్‌లో పుజారా 521 పరుగులతో అదరగొట్టిన సంగతి తెలిసిందే.

ఇదీ చదవండి:నిలకడగా లాలూ ఆరోగ్యం.. ప్రైవేటు వార్డుకు మార్పు

ABOUT THE AUTHOR

...view details