తెలంగాణ

telangana

ETV Bharat / sports

'ధోనీ సారథ్యంలో ఆడేందుకు ఎదురుచూస్తున్నా' - సీఎస్కే

ఐపీఎల్​లో తిరిగి ఆడనుండటంపై స్పందించాడు భారత టెస్టు స్పెషలిస్టు ఛెతేశ్వర్ పుజారా. ధోనీ సారథ్యంలో ఆడటానికి ఎదురుచూస్తున్నట్లు తెలిపాడు. ఐపీఎల్​లో చోటు కల్పించినందుకు చెన్నై ఫ్రాంచైజీకి మరోసారి కృతజ్ఞతలు చెప్పాడు. ఈటీవీ భారత్​తో ప్రత్యేకంగా మాట్లాడాడు.

Fond memories of Mahi bhai, look forward to playing under him again'
'మరోసారి ధోనీ సారథ్యంలో ఆడటానికి ఎదురుచూస్తున్నా'

By

Published : Mar 29, 2021, 7:17 PM IST

Updated : Mar 29, 2021, 9:23 PM IST

భారత టెస్టు స్పెషలిస్టు ఛెతేశ్వర్​ పుజారా.. రాబోయే ఐపీఎల్​పై దృష్టి సారించినట్లు వెల్లడించాడు. ఈసారి వేలంలో చెన్నై జట్టులో చోటు దక్కించుకున్న అతడు.. మరోసారి ధోనీ సారథ్యంలో ఆడటానికి ఎదురుచూస్తున్నట్లు తెలిపాడు. ఐపీఎల్​లో ఆడటం కోసం సుదీర్ఘ కాలంగా వేచి చూస్తున్నట్లు నయా వాల్ పేర్కొన్నాడు. ఈటీవీ భారత్​తో ప్రత్యేకంగా మాట్లాడాడు.

ఇంతకాలం ఐపీఎల్​లో చోటు దక్కకపోవడం దురదృష్టకరమని పుజారా తెలిపాడు. ఈ సారి చెన్నై తరఫున ఆడనుండటం శుభపరిణామమని అన్నాడు. తనపై నమ్మకం ఉంచిన చెన్నై జట్టుకు కృతజ్ఞతలు చెప్పాడు.

"2010లో ధోనీ సారథ్యంలోనే క్రికెట్​ అరంగేట్రం చేశాను. మహీ భాయ్​తో ఆడిన జ్ఞాపకాలు ఉన్నాయి. తిరిగి ఇప్పుడు ఐపీఎల్​లోనూ అతడి నాయకత్వంలో ఆడబోతున్నాను. ధోనీకి భిన్న ఫార్మాట్​లలో ఆడిన అనుభవం ఉంది. అతడి నుంచి వీలైనన్ని ఎక్కువ విషయాలు నేర్చుకోవడానికి ప్రయత్నిస్తాను. అతడితో పాటు సీఎస్కే కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్, మైక్​ హస్సీ నేతృత్వంలో చాలా విషయాలు నేర్చుకోవచ్చు."

-ఛెతేశ్వర్ పుజారా, టీమ్ఇండియా క్రికెటర్​.

"టెస్టులకు, టీ20లకు తేడా స్పష్టంగా ఉంటుంది. పొట్టి ఫార్మాట్​లో వేగంగా పరుగులు సాధించాలి. గతంలో విజయ్​ హజారే, ముస్తక్​ అలీ టోర్నీ, కౌంటీలతో పాటు దేశవాళీ క్రికెట్​ తగినంత ఆడాను. ఆ అనుభవం ఇక్కడ పనికొస్తుంది. మొత్తం మీద నాపై నాకు నమ్మకం ఉంది" అని పుజారా అభిప్రాయపడ్డాడు. టీ20 ఫార్మాట్​కు తగినట్లు షాట్ల ఎంపిక మార్చుకున్నట్లు నయావాల్​ తెలిపాడు. గత ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్​ సిరీస్​లలో రాణించడం తనకు కలిసొచ్చిందని వెల్లడించాడు.

పంత్​ సహజంగా ఆడాడు..

ఇటీవల ఇంగ్లాండ్​తో సిరీస్​లో రిషభ్ తన సహజమైన ఆటతీరును ప్రదర్శించాడని పుజారా తెలిపాడు. 'షాట్ల ఎంపికతో పాటు ఏ రకమైన డెలివరీలను షాట్లుగా ఆడాలో చూసుకోవాలని సూచించాను. ఎప్పుడైనా అనవసర షాట్లకు వెళ్లినప్పుడు మాత్రం అతన్ని హెచ్చరించాను. నేను కూడా అతడి ఆటను ఆస్వాదించాను' అని పుజారా చెప్పుకొచ్చాడు.

కివీస్​పై ప్రతీకారం తీర్చుకుంటాం..

ఇటీవల జరిగిన ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్​ టెస్టు సిరీస్​ల్లో.. భారత్​ మెరుగైన ప్రదర్శన చేసిందని ఛెతేశ్వర్​ తెలిపాడు. ఆసీస్ పర్యటనలో తొలి టెస్టులో ఓడినప్పటికీ.. తిరిగి పుంజుకోవడం గొప్ప విషయమని పేర్కొన్నాడు. వారి సొంత గడ్డపై ఆసీస్​ను ఓడించడం ఆత్మవిశ్వాసాన్ని పెంచిందని వెల్లడించాడు. సౌథాంప్టన్ వేదికగా జరగబోయే ప్రపంచ టెస్టు ఛాంపియన్​ షిప్​ అనేది ప్రపంచకప్​ లాంటిదని అభిప్రాయపడ్డాడు. గతంలో న్యూజిలాండ్​తో సిరీస్​లో ఓడిపోయాం. ప్రస్తుతం డబ్ల్యూటీసీకి ఆతిథ్యమిస్తున్నది తటస్థ వేదిక. కాబట్టి విజయావకాశాలు ఇద్దరికి చెరి సమానంగా ఉంటాయి. ఈ సారి కివీస్​పై విజయం సాధించి గత పరాభవానికి బదులు తీర్చుకోవాలని భావిస్తున్నామని పుజారా తెలిపాడు.

ఇదీ చదవండి:'భారత్​తో వరుస ఓటములపై మాకు భయం లేదు'

Last Updated : Mar 29, 2021, 9:23 PM IST

ABOUT THE AUTHOR

...view details