కరోనా ప్రభావంతో అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) జారీచేసిన కొత్త మార్గదర్శకాలపై టీమ్ఇండియా పేసర్ జస్ప్రీత్ బుమ్రా మాట్లాడాడు. బంతిపై లాలాజలం పూయడం నిషేధించిన క్రమంలో ప్రత్యామ్నాయం అవసరమని అభిప్రాయపడ్డాడు. ఐసీసీ నిర్వహించిన వీడియో సిరీస్ 'ఇన్సైడ్ అవుట్'లో ఇయాన్ బిషప్, షాన్ పొలాక్‌లతో జరిగిన చర్చలో ఈ విషయాన్ని వెల్లడించాడు.
"మైదానంలో కరచాలనం చేసుకోవడం, కలిసి అభినందనలు తెలపడం వంటివి తొలగిస్తే పెద్దగా ఇబ్బంది ఉండదు. బంతిపై లాలాజలాన్ని వాడకూడదనేది మాత్రం నన్ను బాధించింది. ఇందుకు ప్రత్యమ్నాయం ఉంటే బాగుంటుంది. బంతికి మెరుపు తెప్పించకపోతే అది బ్యాట్స్‌మెన్‌కు అనుకూలంగా మారుతుంది. దీని కోసం ఏదైనా వేరే సదుపాయం చేస్తే బాగుంటుంది" అని బుమ్రా చెప్పాడు.