తెలంగాణ

telangana

ETV Bharat / sports

బంగాల్​ 18 ఏళ్ల కల సాకారం చేసిన ట్యాక్సీ డ్రైవర్​ కొడుకు

రంజీ ట్రోఫీలో పశ్చిమ బంగా తుది పోరుకు అర్హత సాధించింది. కర్ణాటకతో మంగళవారం జరిగిన సెమీస్​లో​ 174 పరుగుల తేడాతో గెలిచి, ఫైనల్​ బెర్త్​ ఖరారు చేసుకుంది. 13 ఏళ్ల తర్వాత, ఈ మెగాటోర్నీ టైటిల్​ పోరుకు ఈ జట్టు​ చేరడంలో కీలకపాత్ర పోషించాడు ఓ ట్యాక్సీ డ్రైవర్​ కొడుకు. అతడే బంగాల్​ యువ పేసర్​ ముకేశ్​ కుమార్​.

Bengal pacer Mukesh Kumar
బెంగాల్​ను ఫైనల్లో నిలిపిన టాక్సీ డ్రైవర్​ కొడుకు

By

Published : Mar 4, 2020, 12:10 PM IST

ఇటీవల జరిగిన రంజీ ట్రోఫీ సెమీఫైనల్లో​ కర్ణాటక-పశ్చిమ బంగా తలపడగా, బంగాల్ విజయం సాధించి ఫైనల్​లోకి అడుగుపెట్టింది. 13 ఏళ్ల నిరీక్షణకు తెరదించింది. 2007 తర్వాత ఈ జట్టు.. ఈ టోర్నీలో తుదిపోరుకు అర్హత సాధించింది ఇప్పుడే. ఇలా జరగడంలో కీలకపాత్ర పోషించాడు బౌలర్​ ముకేశ్​ కుమార్​.

బలమైన ప్రత్యర్థి

సెమీస్​లో ఓడిన కర్ణాటకలో టీమిండియా స్టార్​ బ్యాట్స్​మెన్​ కేఎల్​ రాహుల్​, మనీశ్​ పాండే సహా దేశవాళీల్లో దుమ్ములేపుతున్న దేవదత్​ పడిక్కల్​ వంటి ప్రతిభావంతులు ఉన్నారు. అయితే ఈ జట్టులోని ఆరుగురు బ్యాట్స్​మెన్​ను ఔట్​ చేసి వారికి చెక్​ పెట్టాడు ముకేశ్​.

కర్ణాటక జట్టుతో కరచాలనం చేస్తున్న బెంగాల్​ జట్టు

ముకేశ్​ నేపథ్యమిది

బంగాల్​ బౌలర్​ ముకేశ్​ చాలా పేదరికం నుంచి వచ్చాడు. తండ్రి కాశీనాథ్​ వృత్తిరీత్యా ట్యాక్సీ డ్రైవర్​. బిహార్​లోని గోపాల్​గంజ్​ స్వస్థలం. అక్కడ నుంచి 2000 సంవత్సరంలో పని కోసం తండ్రితో కలిసి కోల్​కతాకు తరలివచ్చాడు. గతేడాది నవంబర్​ 28న కేరళ, బంగాల్​ మధ్య రంజీ ఓపెనింగ్​ మ్యాచ్​ జరిగింది. ఆ సమయంలో ముకేశ్​ తండ్రి మరణించాడు. బాధతోనే టోర్నీలో పాల్గొన్న ఇతడు.. కీలక సెమీస్​లో ఆరు వికెట్లతో జట్టును విజయ పథంలో నడిపించాడు.

ముకేశ్​ కుమార్​(ఎడమ నుంచి తొలి వ్యక్తి)

వకార్​ యూనిస్​ తుది మెరుగులు

క్రికెట్​ అంటే పిచ్చి కానీ పేదరికం పెద్ద సమస్య. అయితే డబ్బులు సంపాదించేందుకు అప్పుడప్పుడూ స్థానికంగా జరిగే చాలా టోర్నీల్లో ఆడినా.. ఎక్కడో వెలితి. క్రికెట్​లో ఉన్నత స్థానానికి చేరాలని, రాష్ట్ర స్థాయిలో కనీసం చోటు సంపాదించాలని భావించేవాడు. కానీ తండ్రి నుంచి ఒత్తిడి. ఏదైనా పని చేసుకోవాలని సూచించిన తండ్రిని ఒక్క సంవత్సరం అవకాశం ఇవ్వాలని కోరాడు. ఆ సమయంలో 2015లో బంగాల్​ జట్టు తరఫున బుచ్చిబాబు టోర్నమెంటుకు ఎంపికయ్యాడు ముకేశ్​​. అవకాశం​ వచ్చినా చేతిలో చిల్లిగవ్వ లేదు. కనీసం క్రికెట్​ కిట్టు కొనుక్కోలేని పరిస్థితి. అలాంటప్పుడే టీమిండియా తరఫున ఆడిన మనోజ్​ తివారీ అతడికి బాసటగా నిలిచాడు. బ్యాట్​, లెగ్​ గార్డులు, గ్లౌవ్స్​ ఉచితంగా ఇచ్చాడు. అలా తొలి అడుగులు వేసిన ముకేశ్​.. తర్వాత తన ప్రతిభతో రంజీ జట్టులో చోటు దక్కించుకున్నాడు.

బెంగాల్​ ఆటగాళ్ల సంబరాలు

బంగాల్​ క్రికెట్​ సంఘం ప్రారంభించిన విజన్​ 2020 కార్యక్రమం.. ఇతడి జీవితంలో వెలుగులు నింపింది. ఎందరో యువ క్రికెటర్లకు మార్గదర్శకంగా మారిన ఈ వేదిక ద్వారా శిక్షణ పొందాడు ముకేశ్​. బోర్డు అతడికి అన్ని విధాలా సహాయపడింది. ఇక్కడే పాక్​ దిగ్గజం వకార్​ యూనిస్​ నుంచి మెలకువలూ నేర్చుకున్నాడు​. ఆ తర్వాత తన బౌలింగ్​లో పలు మార్పులు చేసుకుని, తాజాగా జరిగిన రంజీ సీజన్​లో 9 మ్యాచ్​ల్లో 30 వికెట్లు తీశాడు.సెమీస్​లో మనీశ్​ పాండే, కరుణ్​ నాయర్​, దేవదత్​ పడిక్కల్​ వంటి టాప్ ఆటగాళ్లను పెవిలియన్​ చేర్చాడు. ప్రత్యర్థి బ్యాట్స్​మెన్​ను తనదైన ఔట్​ స్వింగర్​, ఇన్​స్వింగర్​లతో భయపెట్టాడు. అంతేకాకుండా బంగాల్​ తరఫున ఎక్కువ వికెట్లు తీసిన బౌలర్లలో ఒకడిగా పేరు తెచ్చుకున్నాడు. ఈ విజయం తర్వాత ఆటగాళ్లంతా ఇతడిని భుజాలపై ఎక్కించుకొని ఊరేగించారు.

ఈడెన్‌ గార్డెన్స్‌ వేదికగా కర్ణాటకతో జరిగిన రంజీ సెమీఫైనల్లో బంగాల్‌ 174 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. టాస్‌ ఓడి బ్యాటింగ్​కు దిగిన బంగాల్.. తొలి ఇన్నింగ్స్‌లో 312 పరుగులకు ఆలౌట్‌ అయింది. అనంతరం 122 పరుగులకే కుప్పకూలింది కర్ణాటక. తర్వాత బంగాల్‌ 161 పరుగులు చేయడం వల్ల కర్ణాటక లక్ష్యం 352కు చేరింది. ముకేశ్‌ కుమార్‌ ఆరు వికెట్లతో చెలరేగి బంగాల్‌కు అమూల్యమైన విజయాన్ని అందించాడు. 1989లో గంగూలీ అరంగేట్ర సీజన్‌లో బంగాల్‌ తొలిసారి రంజీ ట్రోఫీ గెలవడం విశేషం. మొత్తం 14వసారి ఫైనల్​ చేరింది బంగాల్​.

ABOUT THE AUTHOR

...view details