అంతర్జాతీయ క్రికెట్లో సుదీర్ఘకాలం కొనసాగడం అంత ఆషామాషీ వ్యవహారం కాదు. అత్యుత్తమ ఫిట్‌నెస్ ప్రమాణాలు పాటించాలి. నిత్యం కసరత్తులు చేయాలి. గాయాలు కాకుండా కాపాడుకోవాలి. సరిపడా విశ్రాంతి తీసుకోవాలి. ఇలా చేశారు కాబట్టే సచిన్ తెందూల్కర్, కపిల్ దేవ్, ఎంఎస్ ధోనీ, రాహుల్ ద్రవిడ్ వంటి క్రికెటర్లు అన్ని ఫార్మాట్లలోనూ ఎక్కువ మ్యాచులు ఆడగలిగారు. కొందరు ప్రతిభావంతులకు మాత్రం అదృష్టం కలిసిరాలేదు. గాయాల పాలవ్వడంతో కెరీర్ సవ్యంగా సాగడం లేదు. అలాంటి వారిలో బౌలర్లే ఎక్కువ మంది ఉండటం గమనార్హం.
భువి.. వచ్చేదెప్పుడో
టీమ్‌ఇండియాకు దొరికిన తురుపు ముక్క భువనేశ్వర్ కుమార్. బంతిని రెండువైపులా స్వింగ్ చేసే ఈ యువ పేసర్ ఫిట్‌నెస్ ఇబ్బందులు, గాయాల వల్ల ఆడాల్సినన్ని మ్యాచులు ఆడలేకపోతున్నాడు. ఎక్కువగా చీలమండ, కాలి మడమ, పిక్కలు, గజ్జల్లో పట్టేయడం వంటి సమస్యలతో బాధపడుతున్నాడు. అందుకే 2012లోనే అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసినా 21 టెస్టులు, 114 వన్డేలు, 43 టీ20లకే పరిమితం అయ్యాడు.
లేదంటే ఈ తొమ్మిదేళ్ల కాలంలో అతడు కనీసం 50 టెస్టుల వరకు ఆడేవాడు. నిజానికి ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వంటి చల్లని ప్రదేశాల్లో భువి బౌలింగ్‌కు ఫిదా అవ్వాల్సిందే.
ప్చ్.. నెహ్రాకూ తప్పలేదు
పద్దెనిమిదేళ్లు అంతర్జాతీయ క్రికెట్లో ఉంటే ఎన్ని టెస్టులు, ఎన్ని వన్డేలు ఆడాలి. ప్చ్..! టీమ్‌ఇండియా ఒకప్పటి పొడగరి పేసర్ ఆశిష్ నెహ్రాకు ఆ అదృష్టం దక్కలేదు. ఎడమచేతి వాటం పేస్ బౌలింగ్‌తో మహామహులనే వణికించిన నెహ్రాను గాయాలు తీవ్రంగా వేధించాయి. ఎక్కువగా గజ్జలు, చీలమండ, పిక్క కండరాల గాయంతో బాధపడ్డాడు. అంతేకాకుండా సుదీర్ఘకాలం వెన్నునొప్పితో ఇబ్బంది పడ్డాడు.
కీలకమైన పేసర్‌గా ఎదిగిన అతడు జట్టుకు సేవలందించింది మాత్రం తక్కువే. 17 టెస్టులు, 120 వన్డేలు, 27 టీ20లు మాత్రమే ఆడగలిగాడు. అయితే కీలక మ్యాచుల్లో రాణించాడు.
సాహా.. మారాలిక
ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్లో అత్యుత్తమ వికెట్‌కీపర్ వృద్ధిమాన్ సాహా. ఈ విషయంలో ఎవరికీ సందేహాల్లేవ్. 2010లోనే టీమ్‌ఇండియా తరఫున అరంగేట్రం చేసిన సాహా కెరీర్‌లో చాలాకాలం పాటు ఎంఎస్ ధోనీ నీడలోనే ఉండిపోయాడు. మహీకి విశ్రాంతి ఇచ్చినప్పుడు అవకాశాలు దక్కేవి. అతడు సుదీర్ఘ ఫార్మాట్‌కు వీడ్కోలు పలికాక రెగ్యులర్ కీపర్‌గా ఎదిగాడు. ఇప్పటి వరకు 38 టెస్టులు, 9 వన్డేలు ఆడాడు.
వికెట్ల వెనక చురుగ్గా కదిలే సాహాకూ గాయాల బెడద తప్పలేదు. మూడేళ్లుగా అతడు గాయాలతో జట్టుకు దూరమవుతున్నాడు. గతంలో మోచేతికి శస్త్రచికిత్స చేయించుకున్నాడు. క్యాచులు అందుకొనేందుకు విపరీతంగా డైవ్ చేసే సాహాకు మోచేతి గాయాలే ఎక్కువ. ఇప్పుడు పంత్ రాకతో పోటీ ఏర్పడింది. ఇకపై ఎన్ని ఆడతాడన్నది సందేహమే!