టీమిండియా మాజీ సారథి సౌరభ్ గంగూలీ తన అభిప్రాయాలను నిర్మొహమాటంగా వెల్లడిస్తాడు. అక్టోబర్లో బీసీసీఐ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన దాదా.. చారిత్రక పింక్ బాల్ టెస్టు నిర్వహణ, బోర్డు రాజ్యాంగంలో మార్పులు వంటి పలు అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకున్నాడు. అయితే ఇతడి ఎన్నికతో భారత్-పాకిస్థాన్ మధ్య ఆగిపోయిన ద్వైపాక్షిక సిరీస్లు మళ్లీ మొదలవుతాయని ఆశించారు క్రీడా పండితులు. అయితే దాదాపు రెండు నెలలు ఈ పదవిలో ఉన్న దాదా.. ఆ విషయంపై తాజాగా స్పందించాడు.
ఇరు దేశాల మధ్య మ్యాచ్ అంటే రెండు దేశాల ప్రధానుల అనుమతి తప్పక అవసరమని అన్నాడు గంగూలీ. ఇది రెండు ప్రభుత్వాల నిర్ణయమని చెప్పుకొచ్చిన దాదా... అంతర్జాతీయ పర్యటనలు అన్నీ ప్రభుత్వ అనుమతులతోనే కొనసాగుతాయని వివరణ ఇచ్చాడు.