తెలంగాణ

telangana

ETV Bharat / sports

ద్రవిడ్​ను వీడని విరుద్ధ ప్రయోజనాల అంశం

టీమిండియా మాజీ క్రికెటర్ రాహుల్ ద్రవిడ్​.. తమ ముందు మరోసారి హాజరుకావాలని బీసీసీఐ ఎథిక్స్ అధికారి డీకే జైన్ ఆదేశించారు. విరుద్ధ ప్రయోజనాల అంశంపై వివరణ ఇవ్వాలని కోరారు.

ద్రవిడ్

By

Published : Oct 31, 2019, 3:27 PM IST

టీమిండియా మాజీ క్రికెటర్ రాహుల్‌ ద్రవిడ్‌కు పరస్పర విరుద్ధ ప్రయోజనాల సెగ నుంచి ఇంకా విముక్తి రాలేదు. ద్రవిడ్​.. నవంబర్‌ 12న మరోసారి వ్యక్తిగతంగా హాజరుకావాలని బీసీసీఐ ఎథిక్స్‌ అధికారి డీకే జైన్‌ ఆదేశించారు. తనపై ఉన్న ‘విరుద్ధ’ అభియోగాలపై మరింత స్పష్టత, వివరణలు ఇవ్వాలని సూచించారు. సెప్టెంబర్‌ 26న మొదటిసారి ద్రవిడ్‌... ఎథిక్స్‌ అధికారి వద్ద విచారణకు హాజరయ్యాడు.

ప్రస్తుతం బెంగళూరులోని జాతీయ క్రికెట్‌ అకాడమీ డైరక్టర్​గా రాహుల్‌ ద్రవిడ్‌ పనిచేస్తున్నాడు. అంతకు ముందు భారత్‌-ఏ, అండర్‌-19 జట్లకు కోచ్‌గా వ్యవహరించాడు. ఇండియా సిమెంట్స్‌లో ఓ విభాగానికి వైస్‌ ప్రెసిడెంట్‌గానూ ఉన్నాడు. ఈ సంస్థకు ఐపీఎల్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఫ్రాంచైజీ ఉంది. ఈ విషయం విరుద్ధ ప్రయోజనాల కిందకు వస్తుందని, మధ్యప్రదేశ్ క్రికెట్‌ సంఘం జీవితకాల సభ్యుడు సంజీవ్‌ గుప్తా.. ద్రవిడ్​పై ఫిర్యాదు చేశాడు.

మొదటిసారి ఎథిక్స్‌ అధికారిని కలిసినప్పుడు తాను ఇండియా సిమెంట్స్‌ నుంచి వేతనం చెల్లించని సెలవు తీసుకున్నానని ద్రవిడ్‌ వివరణ ఇచ్చాడు. క్రికెట్‌ పాలకుల కమిటీ కూడా అతడిగా మద్దతుగా లేఖ రాసింది.

అదే విధంగా పరస్పర విరుద్ధ ప్రయోజనాల నిబంధనను బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాడు. ఎథిక్స్‌ అధికారి ద్రవిడ్‌కు నోటీసులు పంపినప్పుడు "ఇక భారత క్రికెట్‌ను దేవుడే రక్షించాలి" అని ట్వీట్‌ చేశాడు.

ఈ నిబంధనలో సవరణ చేయాలని క్రికెట్ పాలకుల కమిటీ(సీఓఏ) ఒక నివేదికను సుప్రీం కోర్టుకు సమర్పించింది. దానిని కోర్టు ఆమోదిస్తే బీసీసీఐ, రాష్ట్ర క్రికెట్‌ సంఘాల్లో రెండేళ్ల కాల పరిమితితో ఒప్పందాలు చేసుకున్న మాజీ క్రికెటర్లకు ఊరట లభిస్తుంది. వారు వేర్వేరు పాత్రలు పోషించొచ్చు.

ఇవీ చూడండి.. దిల్లీలో భారత్-బంగ్లా మ్యాచ్​ జరుగుతుంది: గంగూలీ

ABOUT THE AUTHOR

...view details