ఆడింది 9 మ్యాచ్‌లు.. అందులో ఓ జట్టు ఏడు విజయాలు.. కేవలం రెండే పరాజయాలతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది. ఇంకో జట్టు ఏడు ఓటములు, రెండు మాత్రమే విజయాలతో దిగువన ఉంది.. ఈ పాటికే అర్థమై ఉంటుంది. నేడు చెన్నై సూపర్ కింగ్స్ - రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య మ్యాచ్ జరగనుంది. చిన్నస్వామి స్టేడియం వేదికగా రాత్రి 8 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.
సన్‌రైజర్స్‌తో పరాభవం తర్వాత జరుగనున్న ఈ మ్యాచ్‌కు ధోని అందుబాటులో ఉండే అవకాశముంది. ఈ మ్యాచ్‌లో చెన్నై గెలిస్తే ప్లే ఆఫ్ చేరే తొలి జట్టు అవుతుంది. ఇప్పటికే ఏడింటిలో ఓడిన ఆర్సీబీకి ప్రతి మ్యాచ్ కీలకం కానుంది.
చెన్నై సూపర్ కింగ్స్...
ఈ సీజన్లో అప్రతిహత విజయాలతో దూసుకెళ్తున్న జట్టు చెన్నై. ధోని సారథ్యంలో అన్ని విభాగాల్లోనూ సత్తా చాటుతోంది. ముంబయి, హైదరాబాద్ మినహా మిగతా జట్లపై విజయం సాధించింది. ఈ సీజన్ తొలి మ్యాచ్‌లోనే బెంగళూరుని 70 పరుగులకే ఆలౌట్ చేసి టోర్నీని ఘనంగా ఆరంభించింది. మళ్లీ అదే ప్రదర్శన కొనసాగించాలని భావిస్తోంది ధోని సేన. సన్‌రైజర్స్ మ్యాచ్‌లో ధోని విశ్రాంతి తీసుకున్నాడు. ఈ మ్యాచ్‌లో మహీ ఆడే అవకాశం ఉంది. సీజన్లో ఇమ్రాన్ తాహిర్ (13 వికెట్లు) అద్భుత ప్రదర్శన చేస్తున్నాడు. మరోవైపు ధోని ఈ సీజన్లో 230 పరుగులు చేసి నిలకడ కొనసాగిస్తున్నాడు. సమష్టిగా రాణిస్తూ ప్రత్యర్థులపై పైచేయి సాధిస్తుంది చెన్నై.