తెలంగాణ

telangana

ETV Bharat / sports

టీమిండియా లక్ష్యం 273 పరుగులు - DELHI

నిర్ణయాత్మక ఐదో వన్డేలో మొదట బ్యాటింగ్​కు దిగిన ఆస్ట్రేలియా 272 పరుగులు చేసింది. భువనేశ్వర్ మూడు వికెట్లు తీసి ఆకట్టుకున్నాడు.

ఆస్ట్రేలియా టీమిండియా ఐదో వన్డే

By

Published : Mar 13, 2019, 5:31 PM IST

దిల్లీ వేదికగా జరగుతున్న చివరి వన్డేలో భారత బౌలర్లు చెలరేగారు. ఖవాజా, హాండ్స్​కాంబ్​ మెరుపులతో భారీ స్కోరు చేస్తుందనుకున్న ఆస్ట్రేలియాను కట్టడి చేశారు. వరుసగా వికెట్లు తీస్తూ ప్రత్యర్థి బ్యాట్స్​మెన్​పై ఒత్తిడి పెంచారు. దీంతో 50 ఓవర్లలో 272 పరుగులే చేయగలిగింది ఆసీస్​ జట్టు. భారత్​కు 273 పరుగుల లక్ష్యాన్ని నిర్ధేశించింది.

ఖవాజా మెరుపు శతకం..

ఆస్ట్రేలియా బ్యాటింగ్​లో ఖవాజా ఆటే ప్రధాన ఆకర్షణ. గత మ్యాచ్​లో 91 పరుగులతో ఆకట్టుకున్నాడు. ఈ వన్డేలో 100 పరుగులతో అదరగొట్టాడు. తొలి వికెట్​కు ఫించ్​తో కలిసి 76 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. రెండో వికెట్​కు 99 పరుగులు జోడించిందీ ఖవాజా- హ్యాండ్స్​కోంబ్ ద్వయం.

సెంచరీతో ఆకట్టుకున్న ఖవాజా

హాండ్స్​కోంబ్ అర్ధశతకం..

మూడో స్థానంలో వచ్చిన హాండ్స్​కాంబ్ 52 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. ఉన్నంత సేపు ధాటిగా ఆడిన ఈ బ్యాట్స్​మెన్ షమీ బౌలింగ్​లో పంత్​కి క్యాచ్​ ఇచ్చి వెనుదిరిగాడు.

వీరిద్దరు మినహా మిగతా బ్యాట్స్​మెన్ తక్కువ పరుగులకే వెనుదిరిగారు. గత మ్యాచ్​ హీరో టర్నర్ 20 పరుగులే చేశాడు. ఫించ్ 27, మాక్స్​వెల్ 1, కారీ 3 పరుగులకే పరిమితమయ్యారు. చివర్లో వచ్చిన కమిన్స్ 15 పరుగులు, రిచర్డ్​సన్ 29 పరుగులు చేసి ఆస్ట్రేలియాకు గౌరవప్రదమైన స్కోరు అందించారు.

మెరిసిన భారత బౌలర్లు

గత మ్యాచ్​లో ధారాళంగా పరుగులిచ్చినా భారత బౌలర్లు ఈ మ్యాచ్​లో ఆకట్టుకున్నారు. భువనేశ్వర్ మూడు వికెట్లు తీయగా.. జడేజా, షమీ చెరో రెండు వికెట్లు తమ ఖాతాలో వేసుకున్నారు. కుల్దీప్ యాదవ్ ఓ వికెట్ తీశాడు.

ABOUT THE AUTHOR

...view details