తెలంగాణ

telangana

ETV Bharat / sports

భారత్​ X ఆస్ట్రేలియా: వాళ్లున్నారు.. తస్మాత్​ జాగ్రత్త! - స్టీవ్​ స్మిత్​ వార్తలు

2018-19లో జరిగిన ఆస్ట్రేలియా పర్యటనలో టీమ్​ఇండియా సత్తా చాటి టెస్టు, వన్డే సిరీస్​లో ఘనవిజయం సాధించింది. కంగరూల గడ్డపై ఈ గెలుపుతో కోహ్లీసేన సరికొత్త రికార్డు సొంతం చేసుకుంది. అయితే ఈ సారి కంగరూలపై విజయం సాధించడం భారత జట్టుకు అంత సులువు కాదని క్రికెట్​ విశ్లేషకులు అంటున్నారు. స్టీవ్​ స్మిత్​, డేవిడ్​ వార్నర్​ తిరిగి జట్టులోకి చేరడమే కారణమని చెబుతున్నారు. అయితే వీరిద్దరి వల్ల భారత్​కు ఎలాంటి సవాళ్లు వస్తాయో తెలుసుకుందాం.

Australia a different kettle of fish with Smith and Warner back: Gavaskar
భారత్​ X ఆస్ట్రేలియా: వాళ్లున్నారు..తస్మాత్​ జాగ్రత్త!

By

Published : Nov 23, 2020, 7:22 AM IST

ఈ ఏడాది ఆస్ట్రేలియాలో భారత జట్టు పర్యటనపై స్పష్టత వచ్చినప్పటి నుంచి.. "ఈసారి టీమ్‌ఇండియా విజయం అంత సులభం కాదు".. "మన ఆటగాళ్లకు కఠిన సవాలు తప్పదు".. "ఈ సిరీస్‌లో గెలవాలంటే భారత్‌ ఎంతో కష్టపడాల్సిందే".. వంటి మాటలు పదే పదే వినిపిస్తున్నాయి. మరి గత పర్యటనలో ఆసీస్‌లో చారిత్రక విజయాలు నమోదు చేసిన భారత్‌కు.. ఈ సారి ఎదురయ్యే ఆ సవాలు ఏమిటీ? విజయం కోసం జట్టు ఎందుకంత శ్రమించాలని అంటున్నారు? అన్న ప్రశ్నలకు సమాధానం.. స్మిత్‌, వార్నర్‌లే. అవును.. బాల్‌టాంపరింగ్‌ ఉదంతంతో గత సిరీస్‌ (2018-19)కు దూరమైన వాళ్లు ఇప్పుడు జట్టులో ఉండడం వల్ల కంగారూ బృందం బలంగా కనిపిస్తోంది. మరి వాళ్ల చేరిక ఎందుకంత ప్రాధాన్యత సంతరించుకుందో.. వాళ్లు జట్టుపై ఎలాంటి ప్రభావం చూపగలరో ఓసారి చూద్దాం..

భారత క్రికెట్‌ చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోయే సిరీస్‌లు కొన్ని ఉంటాయి. 2018-19లో ఆస్ట్రేలియాలో టీమ్‌ఇండియా పర్యటన కూడా అలాంటిదే. అప్పటివరకూ ఏ భారత జట్టుకు సాధ్యం కాని ఘనతలను కోహ్లీసేన సాధించింది. కంగారూ గడ్డపై తొలిసారి టెస్టు, ద్వైపాక్షిక వన్డే సిరీస్‌లను సొంతం చేసుకుని దశాబ్దాల కలను నిజం చేసింది. మరోసారి ఆ ప్రదర్శనను పునరావృతం చేసేందుకు టీమ్‌ఇండియా మళ్లీ ఆ గడ్డపై అడుగుపెట్టింది. కానీ ఈ సారి జట్టుకు విజయం అంత సులువుగా దక్కేలా లేదు. స్టీవ్‌ స్మిత్‌, డేవిడ్‌ వార్నర్‌లతో కూడిన ఆసీస్‌ను సొంతగడ్డపై ఓడించాలంటే ఎంతో శ్రమించాల్సిందే. పరిమిత ఓవర్ల సిరీస్‌ల్లోనైనా, టెస్టుల్లోనైనా ఆ జట్టును తక్కువ అంచనా వేయడానికి అసలు వీల్లేదు.

ఏంటి తేడా..?

ఇద్దరు ఆటగాళ్లు జట్టుతో తిరిగి చేరగానే పెద్దగా ఏం మారుతుంది? ఆటలో ఏం మార్పు వస్తుంది? అనే సందేహాలు రావడం సహజమే. కానీ స్మిత్‌, వార్నర్‌ విషయంలో మాత్రం అలాంటి ప్రశ్నలకు ఆస్కారమే ఉండదు. ఎందుకుంటే వీళ్లు ఉంటే.. ఆ జట్టును చూసే విధానమే మారుతుంది. సహచర ఆటగాళ్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ప్రత్యర్థులకు సవాళ్లు స్వాగతం పలుకుతాయి. 2018లో దక్షిణాఫ్రికాతో టెస్టులో బాల్‌ టాంపరింగ్‌ కారణంతో స్మిత్‌, వార్నర్‌పై ఏడాది (బాన్‌క్రాఫ్ట్‌పై తొమ్మిది నెలలు) నిషేధం పడింది. దీంతో ఆ ఏడాది చివర్లో ఆస్ట్రేలియాలో టీమ్‌ఇండియా సిరీస్‌లకు వీళ్లు అందుబాటులో లేకుండా పోయారు. బాల్‌ టాంపరింగ్‌తో అప్రతిష్ఠ మూటగట్టుకుని, ఆత్మవిశ్వాసం లోపించిన ఆసీస్‌ను మనవాళ్లు చిత్తు చేశారు.

వారి సలహాలే ప్రమాదం

అలా అనీ మన జట్టు విజయాన్ని తక్కువ చేసి చూడలేం. అయితే ఆ సిరీస్‌లో స్మిత్‌, వార్నర్‌ ఉంటే మాత్రం పోటీ మరోలా ఉండేదనే మాట మాత్రం వాస్తవం. ఇప్పుడు తిరిగి జట్టులో ఉన్న వీళ్లు ఈ సారి భారత్‌తో సిరీస్‌లో సత్తాచాటే అవకాశం ఉంది. బాల్‌ టాంపరింగ్‌ కారణంగా జట్టుకు కెప్టెన్‌, వైస్‌ కెప్టెన్‌గా వ్యవహరించే అవకాశం స్మిత్‌, వార్నర్‌లకు లేకపోయినప్పటికీ వాళ్ల ఉనికి తోటి ఆటగాళ్లకు కొండంత బలాన్ని ఇవ్వనుంది. పేరుకు కెప్టెన్‌గా ఉండకపోయినా మ్యాచ్‌ల సమయంలో జట్టు గెలుపు కోసం వీళ్లు ప్రత్యేక ప్రణాళికలతో, వ్యూహాలతో బరిలో దిగుతారనేది నిజం. మ్యాచ్‌లో కెప్టెన్‌కు సలహాలిస్తూ జట్టును విజయం దిశగా నడిపిస్తారు.

భారత్​పై స్మిత్​, వార్నర్​ల రికార్డు

భారత్​పై మెరుగైన ప్రదర్శన

వ్యక్తిగత ప్రదర్శన పరంగా చూసుకుంటే.. భారత్‌ అంటే చాలు స్మిత్‌ పూనకం వచ్చినట్లు ఊగిపోతాడు. భారత్‌పై 10 టెస్టుల్లో 84.05 సగటుతో 1429 పరుగులు చేసిన అతను.. 18 వన్డేల్లో 60.46 సగటుతో 907 పరుగులు సాధించాడు. భారత్‌తో మ్యాచ్‌ అంటే అతడు ఏ విధంగా రెచ్చిపోతాడో చెప్పడానికి ఈ గణాంకాలే నిదర్శనం. మరే ప్రధాన క్రికెట్‌ దేశాలపై కూడా అతనికి ఇంత ఘనమైన రికార్డు లేదు. మరోవైపు వార్నర్‌ ఒంటిచేత్తో మ్యాచ్‌ ఫలితాన్ని మార్చగల సమర్థుడు. ఇటీవల ముగిసిన ఐపీఎల్‌-13లో గొప్పగా రాణించిన అతడు అదే ఫామ్‌ను టీమ్‌ఇండియాతో సిరీస్‌లోనూ కొనసాగించాలనే పట్టుదలతో ఉన్నాడు.

భారత్‌పై వార్నర్​ రికార్డు (19 వన్డేల్లో 838 పరుగులు, 16 టెస్టుల్లో 1081 పరుగులు) బాగానే ఉంది. ఈ నేపథ్యంలో కోహ్లీసేన మరోసారి ఆస్ట్రేలియాలో సిరీస్‌ నెగ్గాలంటే వీలైనంత త్వరగా వీళ్లను పెవిలియన్‌ చేర్చాల్సి ఉంటుంది. క్రీజులో కుదురుకోనివ్వకుండా మన బౌలర్లు వీళ్లను ఇబ్బంది పెట్టాలి. ఈ ఇద్దరిని కట్టడి చేయడం మీదే మన జట్టు విజయం ఆధారపడి ఉంది.

సునీల్ గావస్కర్

"ఈ సిరీస్‌ను సొంతం చేసుకోవాలనే పట్టుదలతో ఉన్న ఆస్ట్రేలియా జట్టులో స్మిత్‌, వార్నర్‌ కీలకం కానున్నారు. వాళ్లు జట్టులో ఉండడం వల్ల 2018-19 సిరీస్‌ కంటే ఇప్పుడు పరిస్థితులు వేరుగా ఉండనున్నాయి. ఆ జట్టు బ్యాటింగ్‌ విభాగం బలంగా మారింది"

- గావస్కర్

మెక్​గ్రాత్​

"ప్రపంచంలోని అత్యుత్తమ బ్యాట్స్‌మెన్‌లో ఒకడైన స్మిత్‌, విధ్వంసక ఓపెనర్‌ వార్నర్‌ లాంటి ఆటగాళ్లు తిరిగి జట్టుతో చేరడం వల్ల ఆస్ట్రేలియా బ్యాటింగ్‌ విభాగం పటిష్ఠంగా మారింది. గత సిరీస్‌తో పోలిస్తే టీమ్‌ఇండియాతో రాబోయే సిరీస్‌ పూర్తి భిన్నంగా ఉండనుంది. భారత్‌కు క్లిష్ట పరిస్థితులు తప్పవు"

- మెక్‌గ్రాత్‌

ఇదీ చూడండి...ఆసీస్​పై 'డబుల్​ సెంచరీ' వీరులు వీరే..!

ABOUT THE AUTHOR

...view details