యాషెస్ నాలుగో టెస్టు ఆస్ట్రేలియా వైపు మొగ్గుతోంది. మాంచెస్టర్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ 200 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఆసీస్ బౌలర్ జాష్ హెజిల్వుడ్ 4 వికెట్లతో విజృంభించాడు. ఇంగ్లీష్ బ్యాట్స్‌మెన్ రోరీ బర్న్స్(81), జోయ్ రూట్(71) అర్ధశతకాలతో ఆకట్టుకున్నప్పటికీ మిగతా ఆటగాళ్లు పెద్దగా రాణించలేదు.
వర్షం వల్ల మూడోరోజు ఉదయం సెషన్ అంతా తుడిచిపెట్టుకుపోయింది. ఓవర్‌నైట్ స్కోరు 23/1 వద్ద బ్యాటింగ్ ప్రారంభించిన ఇంగ్లీష్ జట్టు ఆరంభంలోనే క్రేగ్ ఓవర్టన్(5) వికెట్ కోల్పోయింది. ఇలాంటి తరుణంలో బర్న్స్ - రూట్ జోడి ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ ముందుకు నడిపించింది. వీరిద్దరూ 141 పరుగుల విలువైన భాగస్వామ్యం నెలకొల్పారు.
నిలకడగా ఆడుతున్న బర్న్స్‌ను ఔట్ చేసి ఈ జోడీని విడదీశాడు హెజిల్వుడ్. అదే ఊపులో రూట్‌ను కూడా ఔట్ చేసి ఇంగ్లాండ్‌ను దెబ్బతీశాడు. అనంతరం జేసన్ రాయ్నూ పెవిలియన్‌కు పంపాడు. మూడోరోజు ఓవర్టన్తో మొదలైన వికెట్ల పతనాన్ని జేసన్రాయ్తో ముగించాడు హెజిల్వుడ్. 166/2 పరుగులతో పటిష్ఠ స్థితిలో ఉన్న ఇంగ్లాండ్ హెజిల్వుడ్ దెబ్బకు కుదేలైంది.