ఆస్ట్రేలియా పర్యటనలో తొలి టెస్టు తర్వాత టీమ్‌ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ భారత్‌కు తిరిగి రావాలనే నిర్ణయం సరైనదేనని.. ఆ విషయంలో అతడి నిర్ణయాన్ని గౌరవిస్తున్నానని ఆస్ట్రేలియా కోచ్ జస్టిన్ లాంగర్ అన్నాడు. జనవరిలో కోహ్లీ సతీమణి అనుష్క తల్లి కాబోతోంది. ఆ సమయంలో భార్యకు తోడుగా ఉండాలని నిర్ణయించుకున్న భారత సారథి.. పితృత్వపు సెలవులు కావాలని బీసీసీఐని కోరాడు. అతడి నిర్ణయాన్ని గౌరవించిన బోర్డు.. తొలి టెస్టు తర్వాత భారత్‌కు వచ్చేందుకు అనుమతిచ్చింది. ఈ నేపథ్యంలోనే లాంగర్ శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ కోహ్లీని అభినందించాడు.
నేను చూసిన వారిలో కోహ్లీ ది బెస్ట్: ఆస్ట్రేలియా కోచ్ - ఆస్ట్రేలియా కోచ్ జస్టిన్ లాంగర్ వార్తలు
ఆస్ట్రేలియాతో తొలి టెస్టు తర్వాత పితృత్వపు సెలవుపై భారత్ వెళ్లాలన్న టీమ్‌ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ నిర్ణయం సరైనదేనని ఆసీస్ కోచ్ జస్టిన్ లాంగర్ అన్నాడు. కోహ్లీ భార్య అనుష్క ప్రసవ సమయంలో ఆమె పక్కనే ఉండాలనే ఆలోచనను తాను గౌరవిస్తున్నట్లు లాంగర్ తెలిపాడు.
"నా జీవితంలో నేను చూసిన ఎంతో మంది ఆటగాళ్లలో విరాట్ కోహ్లీనే అత్యుత్తమం అనడానికి చాలా కారణాలున్నాయి. అతడి బ్యాటింగ్ ఒక్కటే కాదు. అతడి శక్తి సామర్థ్యాలు, ఆటపై ఉండే మక్కువ, మైదానంలో కదలాడే తీరు అన్ని ఆకట్టుకుంటాయి. అతడి ఆటతీరు నమ్మశక్యం కాని విధంగా ఉంటుంది. దాంతో కోహ్లీ అంటే నాకు అమితమైన గౌరవం ఉంది. అలాగే పితృత్వపు మాధుర్యాన్ని అనుభవించేందుకు భారత్‌కు తిరిగి వెళ్లే విషయంలోనూ అతడిని అభినందిస్తున్నా. అతడు కూడా సాధారణ మనిషే. మా ఆటగాళ్లకు కూడా నేనెప్పుడూ ఇదే విషయాన్ని సూచిస్తా. సంతానం కలిగే సమయాన్ని ఎప్పుడూ వదులుకోవద్దని చెబుతాను. ఎందుకంటే అదెంతో ప్రత్యేకమైన సందర్భం. ఇక అతడు లేకపోతే సహజంగానే పరిస్థితి మాకు అనుకూలంగా ఉంటుంది. అయితే, టీమ్‌ఇండియా ప్రమాదకరమైన జట్టని మాకు తెలుసు. ఇంతకుముందు 2018-2019 సీజన్‌లో మాపై విజయం సాధించారు" అని లాంగర్ పేర్కొన్నాడు.