బోర్డర్-గావస్కర్ సిరీస్‌లో భాగంగా ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టెస్టులో టీమ్‌ఇండియా ఎంతో కష్టపడి మ్యాచ్‌ను డ్రా చేసుకుంది. రెండో ఇన్నింగ్స్‌లో చివరి రోజు ఓటమి అంచున నిలిచిన జట్టును హనుమ విహారి(23 నాటౌట్), రవిచంద్రన్ అశ్విన్(39నాటౌట్) ఆదుకున్నారు. వీరిద్దరూ 259 బంతులు ఎదుర్కొని కడదాకా క్రీజులో నిలిచి మ్యాచ్‌ను డ్రాగా ముగించారు. దాంతో భారత్ ఓటమి నుంచి తప్పించుకుంది. అయితే.. ఆరోజు ఆటలో అశ్విన్, విహారి మాత్రమే కీలకం కాదని, శార్దుల్ ఠాకూర్ కూడా అంతే ముఖ్య పాత్ర పోషించాడని తాజాగా తెలిసింది.
రవిశాస్త్రి చెప్పమన్నా.. శార్దూల్ చెప్పలేదు.. - రవి శాస్త్రి
సిడ్నీ టెస్టు డ్రాగా ముగియడంలో కీలక పాత్ర పోషించాడు శార్దుల్ ఠాకూర్. క్రీజులో ఉన్న విహారి, అశ్విన్‌లకు కోచ్ రవిశాస్త్రి చెప్పమన్న ఓ విషయాన్ని అతడు చెప్పకుండా దాచి.. విజయంలో తన వంతు పాత్ర పోషించాడు.
సిడ్నీ టెస్టు చివరి రోజు అశ్విన్, విహారి బ్యాటింగ్ చేస్తుండగా హెడ్‌కోచ్ రవిశాస్త్రి.. శార్దుల్ ద్వారా వారికి ఒక సందేశం పంపాడని ఫీల్డింగ్ కోచ్ ఆర్ శ్రీధర్ అన్నారు. తాజాగా అశ్విన్‌తో ముచ్చటించిన సందర్భంగా ఆయన ఈ ఆసక్తికర విషయం వెల్లడించారు. అయితే, ఆ సందేశం ఏంటో శార్దుల్ తమకు చెప్పలేదని అశ్విన్ పేర్కొన్నాడు. శాస్త్రి.. డ్రింక్స్ సమయంలో శార్దూల్‌ను పిలిచి విహారిని ధాటిగా ఆడమని, మరో ఎండ్‌లో అశ్విన్‌ను వికెట్ కాపాడుకోమని చెప్పమన్నారని శ్రీధర్ వివరించారు. కానీ, శార్దూల్ తమ వద్దకొచ్చి.. 'డ్రెస్సింగ్ రూమ్‌లో చాలా విషయాలు చెప్పమని చెప్పారు. కానీ నేనేం చెప్పను. అవన్నీ వదిలేయండి. మీరు బాగా ఆడుతున్నారు. ఇలాగే కొనసాగండి' అని చెప్పాడని అశ్విన్ అసలు విషయం స్పష్టం చేశాడు.
ఇదీ చూడండి:'నన్ను బౌలరే కాదు అలానూ పిలవచ్చు'