భారత జట్టు క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్‌కు గడ్డుకాలం నడుస్తోంది. ఒకప్పుడు టాప్ స్పిన్నర్‌గా పేరు తెచ్చుకున్న ఈ ఆటగాడు.. ప్రస్తుతం టెస్టులకే పరిమితమయ్యాడు. సుదీర్ఘ మ్యాచ్‌ల్లోనూ తుది జాబితాలో చోటు దక్కించుకునేందుకు విపరీతంగా పోటీ ఎదుర్కొంటున్నాడు. తాజాగా అతడికి మరో ఎదురుదెబ్బ తగలనుంది. ఐపీఎల్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌కు సారథిగా ఉన్న అశ్విన్‌ను... ఆ బాధ్యతల నుంచి తప్పించే యోచనలో ఉంది యాజమాన్యం. రెండు సీజన్లుగా అశ్విన్ విఫలమవడమే కాకుండా జట్టును ఆశించిన స్థాయిలో నడిపించ లేకపోవడం ఇందుకు కారణమని సమాచారం.
ప్రక్షాళన సాధ్యమేనా...!
ఇప్పటికే అన్ని జట్లు వచ్చే ఏడాది లీగ్ కోసం కోచ్‌లు, బృందాలను మారుస్తున్నాయి. అందులో భాగంగానే 2020 ఐపీఎల్ నాటికి సారథిని మార్చాలని పంజాబ్ జట్టు యాజమాన్యం బలంగా అనుకుంటోంది. ఈ విషయంపై ఈ వారం చివర్లో భేటీ నిర్వహించి.. నూతన కెప్టెన్ నియామకంపై కీలక నిర్ణయం తీసుకోనుంది. ఇటీవల పంజాబ్ జట్టు ప్రధాన కోచ్‌గా మైక్ హెసన్ తప్పుకోవడం వల్ల ఆ పదవీ ఖాళీ అయింది.