అశ్విన్ పని అయిపోయినట్లేనా? - kuldeep
కుల్దీప్ యాదవ్, చాహల్ నిలకడగా రాణిస్తూ... జట్టులో అశ్విన్ లేని లోటును పూడుస్తున్నారు.
భారత్ స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ టెస్టు మ్యాచ్‌ల్లో ఇంక కనిపించడా? రవిశాస్త్రి వ్యాఖ్యలు చూస్తే నిజమే అనిపిస్తుంది. 'టెస్టుల్లో కుల్దీప్ యాదవ్, అశ్విన్ ఇద్దరిలో ఒక్కరినే ఎంపిక చేయాల్సి వస్తే చైనామన్కే ప్రాధాన్యతనిస్తాం' అని టీమిండియా కోచ్ రవిశాస్త్రి చెప్పకనే చెప్పాడు. ఫలితంగా, అశ్విన్ ఇక టెస్టుల్లోనూ ఆడకపోవచ్చనే సంకేతాలు వినిపిస్తున్నాయి.
ఇప్పటికే వన్డే జట్టులో చోటు కోల్పోయాడు ఈ తమిళ స్పిన్నర్. ఏడాదిన్నర కాలంగా వన్డే, టీ20లకు దూరమయ్యాడు రవిచంద్రన్. పరిమిత ఓవర్ల క్రికెట్‌తో పాటు టెస్టుల్లోనూ కుల్దీప్ యాదవ్, యజువేంద్ర చాహల్ నిలకడగా రాణిస్తున్నారు. విదేశాల్లోనూ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నారు.
అశ్విన్ స్వదేశంలో మెరుగ్గానే రాణిస్తున్నా...విదేశాల్లో చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేదు. 64 టెస్టుల్లో 25 సగటుతో 336 వికెట్లు తీసిన ఈ వెటరన్ స్పిన్నర్ ఇటీవలి ఆస్ట్రేలియా పర్యటనలో కేవలం ఒకే టెస్టు ఆడాడు.
గాయం కారణంగా జట్టుకు దూరమైన అశ్విన్ స్థానంలో కుల్దీప్ని తీసుకున్నారు. కంగారూల గడ్డపై తొలిసారి ఆడిన చైనామన్ 99 పరుగులిచ్చి 5 వికెట్లు తీసి భారత్ విజయంలో కీలకపాత్ర పోషించాడు. 6 టెస్టుల అనుభవమే ఉన్న ఈ వర్ధమాన క్రీడాకారుడు 24 వికెట్లు పడగొట్టాడు. 38 వన్డేల్లో 77 వికెట్లతో దూసుకెళ్తున్నాడు.