మొహాలీ వేదికగా భారత్-ఆస్ట్రేలియా మధ్య నాలుగో వన్డే జరుగుతుంది. టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్ తీసుకుంది. ఇప్పటికే 2-1 తేడాతో సిరీస్ ఆధిక్యంలో ఉన్న కోహ్లీ సేన ఈ మ్యాచ్ గెలిచి సిరీస్ కైవసం చేసుకోవాలని భావిస్తోంది. ప్రపంచకప్ తుది జట్టులో స్థానం కోసం ఎదురుచూస్తున్న రిషభ్ పంత్ కు ఈ మ్యాచ్ కీలకం కానుంది.
మూడో వన్డేలో ఓటమిపాలైన భారత్ జట్టులో కొన్ని మార్పులు చేసింది. ధోనికి ఇప్పటికే విశ్రాంతి ఇస్తున్నట్లు ప్రకటించిన యాజమాన్యం పంత్‌కు వికెట్ కీపింగ్ బాధ్యతలు అప్పగించింది. షమి గాయంతో ఈ మ్యాచ్‌కు దూరమవగా ఆ స్థానంలో భువనేశ్వర్ ఆడనుండగా రాయుడు స్థానంలో రాహుల్ కి అవకాశం ఇచ్చింది. జడేజా స్థానంలో చాహల్ ఆడనున్నాడు.
మెగా టోర్నీకి ముందు టాప్ ఆర్డర్ సమస్య జట్టును ఇబ్బందిపెడుతోంది. ఓపెనర్లు రోహిత్, ధావన్ వరుస మ్యాచుల్లో విఫలమవుతున్నారు. కోహ్లీ ఈ సిరీస్ లో రెండు సెంచరీలతో 283 పరుగులు సాధించగా.. కేదార్ 118 పరుగులు చేశాడు. మిగిలిన బ్యాట్స్‌మెన్ ఆకట్టుకోలేకపోతున్నారు.
ఓపెనర్ రోహిత్ మూడు మ్యాచుల్లో కలిపి 51 పరుగులు చేయగా.. అంబటి రాయుడు కేవలం 33, ధావన్ 22 పరుగులు సాధించారు. ఇంగ్లండ్‌లో జరిగే వరల్డ్‌కప్‌కు ముందు ఇంకో రెండు మ్యాచ్‌లే మిగిలున్న తరుణంలో వారు పుంజుకోవాల్సిన అవసరముంది.