పాకిస్థాన్ మాజీ ఆటగాడు షాహిద్ అఫ్రిదీ రెచ్చిపోయాడు. గ్లోబల్ టీ 20 కెనడా టోర్నీలో బ్రాంప్టన్ వోల్వ్స్ తరపున ఆడిన అఫ్రిదీ 40 బంతుల్లో 81 పరుగులతో విజృంభించాడు. ఫలితంగా ఎడ్మంటన్ రాయల్స్‌తో జరిగిన పోరులో బ్రాంప్టన్ జట్టు 27 పరుగుల తేడాతో గెలిచింది. బ్యాట్‌తోనే కాదు బౌలింగ్‌లోనూ మెరిశాడు. మూడు ఓవర్లు వేసి ఓ వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బ్రాంప్టన్ జట్టు ఇన్నింగ్స్ ధాటిగా ఆరంభించింది. ఓపెనర్ లెన్డి సిమ్మన్స్ అర్ధశతకంతో ఆకట్టుకున్నాడు. 83 పరుగుల వరకు ఒక వికెట్ మాత్రమే కోల్పోయిన బ్రాంప్టన్ అనంతరం వెంటవెంటనే రెండు వికెట్లు చేజార్చుకుంది.
అదరగొట్టిన అఫ్రిదీ..
అనంతరం క్రీజులోకి వచ్చిన షాహిద్ ఆరంభం నుంచి అదరగొట్టాడు. ఎడపెడా బౌండరీలు బాదుతూ ప్రత్యర్థికి ముచ్చెమటలు పట్టించాడు. 22 బంతుల్లోనే 50 పరుగులు పూర్తి చేశాడు. అర్ధశతకం తర్వాత కాస్త నెమ్మదించినా చివర్లో మళ్లీ బ్యాట్ ఝుళిపించాడు. 40 బంతుల్లో 81 పరుగులు చేశాడు. ఇందులో 10 ఫోర్లు, 5 సిక్సర్లు ఉన్నాయి. వయసు పైబడినా తన బ్యాటింగ్‌లో ఏ మాత్రం దూకుడు తగ్గించలేదు అఫ్రిదీ.
208 పరుగుల లక్ష్యఛేదనలో బరిలో దిగిన ఎడ్మంటన్ రాయల్స్ 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 180 పరుగులు మాత్రమే చేయగలిగింది. జేమ్స్ నీషమ్(33, 18 బంతుల్లో) మినహా మిగతా వారు పెద్దగా ఆకట్టుకోలేదు. బ్రాంప్టన్ బౌలర్లలో ఇష్ సోధి, జహూర్ ఖాన్ తలో మూడు వికెట్లు తమ ఖాతాలో వేసుకున్నారు.
ఇది చదవండి: 'నాకు నచ్చకపోతే నా ముఖంలోనే తెలుస్తుంది'