క్రైస్ట్‌చర్చ్ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారత్ ఆధిపత్యం ప్రదర్శించింది. టీమిండియా బౌలర్ల ధాటికి 73.1 ఓవర్లకు ఆ జట్టు 235 పరుగులు చేసి ఆలౌట్ అయింది. కివీస్ బ్యాటింగ్‌లో టామ్ లాథమ్(52), జేమిసన్(49) రాణించారు. ప్రస్తుతం భారత్ 7 పరుగుల ఆధిక్యంలో నిలిచింది.
లాథమ్ ఒక్కడే..
అంతకుముందు 63/0తో రెండో రోజు ఆట ప్రారంభించిన కివీస్‌కు.. ఆదిలోనే షాకిచ్చాడు ఉమేశ్ యాదవ్. 25.3 ఓవర్లో టామ్ బ్లండెల్ 30(77 బంతుల్లో 4ఫోర్లు)ను ఎల్బీగా పెవిలియన్ పంపాడు. మరో మూడు పరుగుల వ్యవధిలో కెప్టెన్ కేన్ విలియమ్సన్(3)ను బుమ్రా బోల్తా కొట్టించాడు. కీపర్‌కు క్యాచ్ ఇవ్వడం వల్ల విలియమ్సన్ తక్కువ స్కోరుకే పరిమితమయ్యాడు. తర్వాత రాస్‌టేలర్(15)తో కలిసి టామ్ లాథమ్ 52(122 బంతుల్లో 5ఫోర్లు) ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. ఇద్దరూ 40 పరుగుల భాగస్వామ్యం జోడించాక జడేజా చక్కటి బంతితో టేలర్‌ను ఔట్ చేశాడు. కాసేపటికే లాథమ్(52) అర్ధశతకం పూర్తి చేసుకున్నాక షమి బౌలింగ్‌లో బౌల్డయ్యాడు. హెన్రీ నికోల్స్(14) షమి బౌలింగ్‌లోనే కోహ్లీకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.