Cameron Green Kidney Disease :ఆస్ట్రేలియా స్టార్ ఆల్‌రౌండర్ కామెరూన్ గ్రీన్ తన గురించి షాకింగ్ విషయాలు షేర్ చేసుకున్నాడు. తనకు చిన్నప్పటి నుంచి దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధి ఉందని తెలిపాడు. అది పూర్తిగా నయం కాని వ్యాధి అని లక్షణాలు కూడా ఉండవని వెల్లడించాడు. అయితే ఈ విషయాన్ని ఇప్పటివరకు గోప్యంగా ఉంచానని పేర్కొన్నాడు. అందరి కిడ్నీల్లా తన మూత్రపిండాలు రక్తాన్ని ఫిల్టర్ చేయలేవని వెల్లడించాడు. ప్రస్తుతం కిడ్నీలు 60 శాతం పనిచేస్తున్నాయని వ్యాధి స్టేజ్-2లో ఉందని తెలిపాడు. ఈ మేరకు ఓ ఇంటర్వ్యూలో గ్రీన్ తెలిపాడు.
''నేను మా తల్లి కడుపులోఉన్నప్పుడే నాకు కిడ్నీ సంబంధిత సమస్య ఉన్నట్లు డాక్టర్లు గుర్తించారు. ఇదే విషయం మా తల్లిదండ్రులు నాకు చెప్పారు. అయితే, అప్పుడు ఎలాంటి లక్షణాలు కనిపించలేదు. ఆల్ట్రాసౌండ్ స్కానింగ్ తీయడం వల్ల అసలు విషయం బయటపడింది. కిడ్నీలు సాధారణంగా ఉండాల్సినంత పరిమాణంలో లేవని వైద్యులు చెప్పారు. కుటుంబపరంగా ఇది మాకు పెద్ద షాక్. కానీ, నెమ్మదిగా రోజులు గడుస్తున్న కొద్దీ నా ఆరోగ్యం మెరుగైంది. ఇప్పుడు నా పరిస్థితి ఫర్వాలేదు. నా అదృష్టం ఏమిటంటే ఇతరుల మాదిరిగా నేను శారీరకంగా ఎక్కువ దెబ్బతినలేదు. నా ఆరోగ్య సమస్య గురించి జట్టులో కొందరికి తెలుసు. కోచింగ్ సిబ్బందికీ చెప్పా. ఆహారపు అలవాట్లను అదుపులో ఉంచుకోవాల్సిన అవసరం ఉందని తెలుసు''
--కామెరూన్ గ్రీన్, ఆస్ట్రేలియా క్రికెటర్
12 ఏళ్లకు మించి బతకడన్నారు! : గ్రీన్ తండ్రి
''కామెరూన్ గ్రీన్ ఆరోగ్యం విషయంలో చాలా ఆందోళన పడ్డాం. నా భార్య 19 వారాల గర్భంతో ఉండగా తీయించిన స్కానింగ్‌లో ఈ కిడ్నీ సమస్య బయటపడింది. గ్రీన్ 12 ఏళ్ల వయసులోనే ప్రాణాలు కోల్పోవచ్చని వైద్యులు అంచనావేశారు. ఆ సమయంలో మేము పడ్డ బాధ వర్ణించలేనిది. అయితే, ధైర్యం కోల్పోకుండా నిరంతరం గ్రీన్ ఆరోగ్యంపై దృష్టిపెట్టాం. ఇప్పుడు గతాన్ని తలుచుకుంటే ఒక్కోసారి భయంగా ఉంటుంది'' అని కామెరూన్ గ్రీన్ తండ్రి గ్యారీ వెల్లడించారు.