బోర్డర్ గావస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న కీలకమైన నాలుగో టెస్ట్ రెండో రోజు ఆట పూర్తయింది. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో ఆలౌట్ అయిన అనంతరం భారత్ తొలి ఇన్నింగ్స్ ప్రారంభించింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 36 పరుగులు చేసింది. క్రీజ్‌లో రోహిత్ శర్మ (17*), శుభ్‌మన్ గిల్ (18*) ఉన్నారు. దీంతో ఆసీస్ కంటే 444 పరుగులు వెనుకబడి ఉంది. మూడో రోజు పూర్తిగా బ్యాటింగ్ చేస్తేనే భారత్‌కు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఆసీస్ మాదిరిగా టీమ్‌ఇండియా బ్యాటర్లు రాణించాలి.
అంతకముందు ఓవర్‌నైట్ స్కోర్ 255/4తో రెండో రోజు ఆటను ఆరంభించిన ఆసీస్.. 167.2 ఓవర్లలో 480 పరుగుల వద్ద ఆలౌటైంది. బ్యాటింగ్ ఖవాజా (180), గ్రీన్ (114) సెంచరీలు బాదేశారు. ట్రావిస్ హెడ్ (32), స్టీవ్ స్మిత్ (38), నాథన్ లైన్ (34), మర్ఫీ (41) కూడా రాణించారు. భారత బౌలర్లలో అశ్విన్ 6 వికెట్లు తీయగా.. షమీ 2, జడేజా, అక్షర్ ఒక్కో వికెట్ చొప్పున పడగొట్టారు.
అశ్విన్ రికార్డులే రికార్డులు..
ఇక 6 వికెట్లతో చెలరేగిన టీమ్‌ఇండియా బౌలర్ అశ్విన్ పలు అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. స్వదేశంలో టెస్టు క్రికెట్‌లో అత్యధిక ఐదు వికెట్ల హాల్స్ సాధించిన బౌలర్‌గా నిలిచాడు. ఇప్పటి వరకు ఈ రికార్డు భారత దిగ్గజ స్పిన్నర్ అనిల్ కుంబ్లే పేరిట ఉండేది. భారత్ గడ్డపై టెస్టుల్లో కుంబ్లే 25 సార్లు ఐదు వికెట్లు ఘనత సాధించాడు. ఇక తాజా మ్యాచ్‌లో 26వ ఐదు వికెట్ హాల్ నమోదు చేసిన అశ్విన్.. కుంబ్లేను అధిగమించాడు. కాగా అశ్విన్ దారిదాపుల్లో కూడా ఏ భారత బౌలర్ లేడు.
అదే విధంగా మరో అరుదైన రికార్డును కూడా అశ్విన్ తన ఖాతాలో వేసుకున్నాడు. టెస్టు క్రికెట్‌లో ఆస్ట్రేలియాపై అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్‌గా అశ్విన్(113) రికార్డులకెక్కాడు. ఈ క్రమంలో అనిల్ కుంబ్లే(111) రికార్డును అశ్విన్ బ్రేక్ చేశాడు. వీరిద్దరూ మినహా మరే భారత బౌలర్ ఈ జట్టుపై 100 వికెట్లకు మించి తీయలేదు. మరోవైపు బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో అత్యధిక వికెట్లు పడగొట్టిన ఆసీస్ స్పిన్నర్ నాథన్ లియాన్(113) రికార్డును అశ్విన్ సమం చేశాడు.
23 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి
భారత గడ్డపై 2000 సంవత్సరం తర్వాత ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 400 పైచిలుకు స్కోరు చేయడం ఇదే తొలిసారి. ఇప్పటివరకు(తాజా మ్యాచ్ కలిపి) తొమ్మిది సందర్భాల్లో ఈ మేర మొదటి ఇన్నింగ్స్‌లో 400 పరుగుల మార్కు దాటింది. తాజా మ్యాచ్ మినహాయిస్తే.. ఈ మేర స్కోరు చేసిన సందర్భాల్లో ఒకసారి ఆస్ట్రేలియా విజయం సాధించగా.. 4సార్లు ఓటమిపాలైంది. మూడుసార్లు మ్యాచ్ డ్రా చేసుకుంది.