Ben Stokes Ahead of Ashes 2021: ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ మధ్య యాషెస్ సిరీస్‌కు సమయం దగ్గరపడుతోంది. డిసెంబర్ 8న తొలి టెస్టు గబ్బా వేదికగా ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ కీలక వ్యాఖ్యలు చేశాడు. మానసిక ఒత్తిడి, చూపుడువేలికి గాయం కారణంగా చాలా రోజులు ఆటకు దూరంగా ఉన్న స్టోక్స్.. యాషెస్‌తో రీఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ నేపథ్యంలో.. జీవితం అంటే భయం వేసిన క్షణాల గురించి చెప్పుకొచ్చాడు. 'ది డైలీ మిర్రర్'లో వ్యాసం రాసిన స్టోక్స్.. ఓ తప్పిదం వల్ల తాను ఎదుర్కొన్న క్లిష్ట పరిస్థితుల గురించి వివరించాడు.
"ఓ చిన్న మాత్ర(ట్యాబ్లెట్) నన్ను ఉక్కిరిబిక్కిరి చేసింది. అది గొంతులో ఇరుక్కుని శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా మారింది. అది బయటకు వచ్చే వరకు చాలా ఇబ్బంది పడ్డా. జీవితంలో ఇవే చివరి క్షణాలేమో అనిపించింది"
--బెన్ స్టోక్స్, ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్
టీమ్ డాక్టర్ వచ్చి అతడికి ట్రీట్మెంట్ చేసినట్లు స్టోక్స్ చెప్పాడు. ఆ ట్యాబ్లెట్ గొంతులో ఇరుక్కుపోయినందుకు శరీరం ఎలా ప్రతిస్పందించిందో డాక్టర్ వివరించిందని తెలిపాడు. ఆ ఘటన జరిగిన తర్వాత రోజే ప్రాక్టీస్ సమయంలో మోచేయికి గాయమైనట్లు వివరించాడు.
అయితే.. యాషెస్ సిరీస్(Ashes series 2021) తొలి టెస్టుకు స్టోక్స్ సిద్ధంగా ఉన్నాడని భావిస్తున్నట్లు ఇంగ్లాండ్ జట్టు మేనేజింగ్ డైరెక్టర్ అష్లే గైల్స్ తెలిపాడు.