Ben Stokes Out Sachin Tendulkar: యాషెస్ టెస్టు సిరీస్‌లో భాగంగా సిడ్నీలో జరుగుతున్న నాలుగో టెస్టులో ఇంగ్లాండ్ ఆటగాడు బెన్ స్టోక్స్ అనూహ్య రీతిలో ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకోవడంపై.. భారత క్రికెట్ దిగ్గజం సచిన్ తెందూల్కర్ స్పందించాడు. బౌలర్లకు అనుకూలంగా కొత్త చట్టం తీసుకురావాలని ట్వీట్ చేశాడు. 'బంతి వికెట్లను తాకినా బెయిల్స్ కింద పడకుంటే.. అది ఔటా? కాదా? అనే విషయాన్ని తెలిపేందుకు 'హిట్టింగ్ ది వికెట్స్' అనే కొత్త చట్టాన్ని ప్రవేశ పెట్టాలి. మీరేమంటారు గాయ్స్?' అని ఆసీస్ స్పిన్ దిగ్గజం షేన్‌వార్న్‌ని ట్యాగ్ చేశాడు.
సచిన్ ట్వీట్‌పై స్పందించిన షేన్ వార్న్.. ఈ విషయంపై చర్చ జరగాల్సిన అవసరముందని పేర్కొన్నాడు. "ఇది చాలా ఆసక్తికర విషయం. దీనిపై చర్చించాల్సిన అవసరం ఉంది ఫ్రెండ్. క్రికెట్ కమిటీతో చర్చించిన తర్వాత నీకు సమాధానమిస్తాను. ఇలాంటి ఘటన ఇంతకు ముందు ఎన్నడూ చూడలేదు. కామెరూన్ గ్రీన్ 142 కి.మీ. వేగంతో బంతిని సంధించాడు. అయినా బెయిల్స్ కింద పడకపోవడం ఆశ్చర్యం" అని షేన్ వార్న్ సమాధానిచ్చాడు.
ఈ విషయంపై ఆస్ట్రేలియా మరో మాజీ ఆటగాడు రికీ పాంటింగ్ కూడా ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. "నేనింత వరకు ఇలాంటి బంతిని చూడలేదు. వాస్తవానికి బంతి వికెట్‌ను తాకి పక్కకు వెళ్లిపోయింది. అందుకే బెయిల్స్ కింద పడకుండా అలాగే ఉండిపోయాయి" అని రికీ పాంటింగ్ పేర్కొన్నాడు.