తెలంగాణ

telangana

ETV Bharat / sports

రవిశాస్త్రి అలా అనడం కరెక్ట్​ కాదన్న బెన్ స్టోక్స్ - బెన్​స్టోక్స్​ వన్డే ఫార్మాట్​

ఓ విషయంపై ఇటీవలే రవిశాస్త్రి అన్న వ్యాఖ్యలను తాను అంగీకరించనని అన్నాడు ఇంగ్లాండ్‌ టెస్టు కెప్టెన్‌ బెన్‌స్టోక్స్‌. అలాగే వన్డే క్రికెట్​ గురించి కూడా కీలక వ్యాఖ్యలు చేశాడు.

ravisastri benstokes
రవిశాస్త్రి బెన్​స్టోక్స్​

By

Published : Aug 24, 2022, 10:42 AM IST

వన్డే ఫార్మాట్‌పై కీలక వ్యాఖ్యలు చేశాడు ఇంగ్లాండ్‌ టెస్టు కెప్టెన్‌ బెన్‌స్టోక్స్‌. వన్డే క్రికెట్​ ఆకర్షణ కోల్పోతున్న నేపథ్యంలో 50 ఓవర్ల నుంచి ఇన్నింగ్స్‌ను 40 ఓవర్లకు తగ్గిస్తే బాగుంటుందన్న ప్రతిపాదనకు మద్దతు పలికాడు. తీరిక లేకుండా మ్యాచ్‌లు ఆడుతుండడంతో ఇటీవలే స్టోక్స్‌ వన్డేలకు వీడ్కోలు పలికాడు. "ప్రపంచవ్యాప్తంగా క్రికెటర్లు ఏ స్థాయిలో మ్యాచ్‌లు ఆడుతున్నారో పరిశీలించాలి. వన్డేలు కొనసాగాలనే ఎవ్వరైనా కోరుకుంటారు. కానీ దాని రూపాన్ని మార్చడంపై ఐసీసీ దృష్టిసారిస్తే బాగుంటుంది. టీ20లతో పాటు ఇంగ్లాండ్‌లో ‘హండ్రెడ్‌ ఆడుతున్నట్లే 50 ఓవర్లను 40కి తగ్గించే ప్రతిపాదనను పరిశీలించవచ్చు. క్రికెట్‌ పరిమితి పెరిగిపోతున్న నేపథ్యంలో పది ఓవర్లు తగ్గిస్తే ఒత్తిడి తగ్గుతుంది. అదొక పరిష్కారం కావచ్చు" అని స్టోక్స్‌ అన్నాడు.

వ్యాపారమైంది.. టీ20 క్రికెట్‌పై కీలక వ్యాఖ్యలు చేశాడు స్టోక్స్​. పొట్టి ఫార్మాట్‌లో వ్యాపార ధోరణి ఎక్కువైపోయిందని విమర్శించాడు. అయితే.. టెస్టు క్రికెట్‌ ఎప్పుడూ ఉన్నత స్థాయిలోనే ఉంటుందని వివరించాడు. ప్రపంచవ్యాప్తంగా టీ20 లీగ్‌లు పెరిగిపోయాయని.. అందుకే ఇది వ్యాపారంగా మారిందని చెప్పాడు. ద్వైపాక్షిక సిరీస్‌లను నిర్వహించడం కత్తిమీద సాములా తయారైందన్నాడు. తాను ఎప్పటికీ టెస్టు క్రికెట్‌ ప్రమోట్ చేసేందుకే కృషి చేస్తానని వెల్లడించాడు.

రవిశాస్త్రి మాటలను అంగీకరించను.. భవిష్యత్తులో ఐదారు దేశాలతోనే టెస్టులు ఆడించాలని ఇటీవల టీమ్‌ఇండియా మాజీ కోచ్ రవిశాస్త్రి సూచనను అంగీకరించనని పేర్కొన్నాడు. "టెస్టులను ఆడే దేశాల విషయంలో రవిశాస్త్రి సూచన బాగుందని అనిపిస్తున్నప్పటికీ పూర్తిగా అంగీకరించను. మరోవైపు ఫ్రాంచైజీ క్రికెట్‌ విపరీతంగా వృద్ధి చెందుతోంది. వాటికి ప్రపంచవ్యాప్తంగా చాలా టీమ్‌లు ఉన్నాయి. భారత టీ20 లీగ్‌, కరేబియన్‌ లీగ్‌ ఇప్పటికే ఉండగా.. తాజాగా దక్షిణాఫ్రికాలోనూ ఫ్రాంచైజీ క్రికెట్ వచ్చేసింది. మీరు ఏమైనా అనుకోండి.. కానీ టీ20 ఇప్పుడు పూర్తిగా వ్యాపారమైపోయింది. అయితే.. ఇది కూడా క్రికెట్‌కు మేలు చేస్తుందనే చెప్పాలి. చాలా మంది ఆటగాళ్లకు అవకాశం కల్పిస్తోంది. 15 ఏళ్ల కిందటితో పోలిస్తే ఇప్పుడు అవకాశాలు భారీగా పెరిగాయి. భద్రత, సంపాదన ఉండటంతో చాలామంది క్రికెట్‌ను కెరీర్‌గా ఎంపిక చేసుకుంటున్నారు. ఫ్రాంచైజీ క్రికెట్‌ ఎంత పాపులారిటి సాధించినా.. టెస్టు ఫార్మాట్‌ మత్రం ఎవర్‌గ్రీన్‌. టెస్టులకు నేను పెద్ద అంబాసిడర్‌గా పని చేస్తా. క్రికెట్‌లో స్వచ్ఛమైన ఫార్మాట్‌ ఏదైనా ఉందంటే అది టెస్టులు మాత్రమేనని నా అభిప్రాయం. ఇతర స్టార్‌ ఆటగాళ్లు కూడా ఇదే అభిప్రాయంతో ఉన్నారని అనుకుంటున్నా" అని స్టోక్స్‌ వివరించాడు.

షెడ్యూల్‌ను బట్టే ఐపీఎల్‌కు.. తాను ఐపీఎల్‌లో ఆడడంపై స్టోక్స్‌ మాట్లాడుతూ.. "షెడ్యూళ్లను బట్టే ఏదైనా చేయాలి. టెస్టు క్రికెట్‌కే నా తొలి ప్రాధాన్యం. దాన్ని అనుసరించే నా నిర్ణయాలు ఉంటాయి. ఒక కెప్టెన్‌గా నా మీద ఎంతో బాధ్యత ఉంది. నేను ఐపీఎల్‌లో నాలుగేళ్లు ఆడాను. అక్కడ ఉన్న ప్రతిసారీ ఎంతో ఆస్వాదించాను. అదొక అద్భుతమైన టోర్నీ. ప్రపంచంలో అత్యుత్తమ ఆటగాళ్లు, మేటి కోచ్‌లతో కలిసి పని చేయడం బాగుంటుంది. కానీ ఐపీఎల్‌కు సమయం కేటాయించాలంటే నా అంతర్జాతీయ షెడ్యూల్‌ సహకరించాలి" అని స్టోక్స్‌ అన్నాడు.

ఇదీ చూడండి: లెజెండ్స్ లీగ్‌ క్రికెట్‌ సీజన్​ 2 షెడ్యూల్​ రిలీజ్​, వేదికలు ఇవే

ABOUT THE AUTHOR

...view details