క్రికెట్లో ఫుల్ లెంగ్త్ బాల్, యార్కర్‌ను ఎదుర్కోవాలంటే బ్యాట్స్‌మన్‌కు ఒకింత కష్టమే. ఆ బంతిని డిఫెన్స్ చేస్తేనే గొప్ప.. అలాంటిది బ్యాట్స్‌మన్ తమదైన శైలిలో బంతిని బౌండరీకి తరలిస్తే. వావ్ అంటూ నోరు వెళ్లబెట్టాల్సిందే. ఆ కోవకు చెందినదే ధోనీ హెలికాప్టర్ షాట్. అయితే దీనిని మహి కంటే ముందే మరో ఆటగాడు ఆడి చూపించాడు. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారింది.
ధోనీ కంటే ముందే హెలికాప్టర్ షాట్ ఆడింది అతడే!
బ్యాట్స్మన్లు తమదైన శైలిలో కొట్టే షాట్లను బట్టి కొన్నింటికి ఆ క్రికెటర్ల పేర్లు స్థిరపడతాయి. అలా వచ్చినవే దిల్ స్కూప్, మహి హెలికాప్టర్ షాట్, ఏబీ 360 డిగ్రీస్ షాట్. వీటిలో క్రికెట్ అభిమానులకు ఎక్కువగా గుర్తుండిపోయే స్టైల్ హెలికాప్టర్ షాట్. దీనిని ధోనీ కంటే ముందే మరో క్రికెటర్ ఆడి చూపించాడు. అతడెవరో తెలుసుకోవాలంటే చదవండి మరి.
మహేంద్ర సింగ్ ధోనీ, మహమ్మద్ అజారుద్దీన్
భారత మాజీ కెప్టెన్ మహమ్మద్ అజారుద్దీన్ ఈ హెలికాప్టర్ షాట్‌ను గతంలోనే ఆడాడు. 1996లో కోల్‌కతా వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో అజారుద్దీన్ కేవలం 77 బంతుల్లోనే 109 పరుగులు చేశాడు. ఇందులో 18 ఫోర్లు, ఒక సిక్స్ ఉన్నాయి. సౌతాఫ్రికా ఆల్‌రౌండర్ క్లూసెనర్ వేసిన ఓ ఓవర్లో అజారుద్దీన్ ఏకంగా 5 ఫోర్లు బాదాడు. తొలి రెండు బంతులకు బౌండరీలు కొట్టడం వల్ల తదుపరి బంతిని యార్కర్‌గా వేశాడు ప్రోటీస్ బౌలర్. ఆ బంతిని హెలికాప్టర్ షాట్ ఆడాడు అజారుద్దీన్.