Asia Cup 2022 : ఆసియాకప్‌లో ఫైనల్‌కు కూడా చేరకపోవడం కారణంగా ఈ టోర్నీలో టీమ్ ఇండియా ప్రదర్శనను బీసీసీఐ సమీక్షించింది. ముఖ్యంగా మిడిల్ ఓవర్లలో భారత బ్యాటర్లు నత్తనడకన బ్యాటింగ్ చేయడమే పరాజయాలకు కారణమని తేల్చారు. అక్టోబర్‌లో ఆస్ట్రేలియా వేదికగా జరిగే ఐసీసీ వరల్డ్‌కప్ ముందు ఈ విషయంపై దృష్టిసారించాల్సిన అవసరం ఉందని బీసీసీఐ పెద్దలు అభిప్రాయపడ్డారు.
ఆసియాకప్‌లో జరిగిన మ్యాచ్‌ల్లో 7వ ఓవర్ నుంచి 15వ ఓవర్ వరకు భారత బ్యాటర్లు నెమ్మదిగా ఆడారు. ముఖ్యంగా స్లో బౌలర్లను ఎదుర్కొవడంతో ఇబ్బంది పడ్డారు. ఈ మిడిల్ ఓవర్లలో బ్యాటింగే టీమిండియాకు ప్రధాన సమస్యగా మారిందని బీసీసీఐ అభిప్రాయపడింది. పాకిస్థాన్‌తో జరిగిన తొలిమ్యాచ్‌లో 7వ ఓవర్ నుంచి 15 ఓవర్ వరకు ఉన్న 9 ఓవర్లలో భారత్ కేవలం 59 పరుగులే సాధించింది. మూడు వికెట్లు కోల్పోయింది. ఇక హాంగ్‌కాంగ్‌తో జరిగిన పోరులో ఈ 9 మిడిల్ ఓవర్లలో కేవలం 62 పరుగులే వచ్చాయి. ఇక సూపర్-4లో పాకిస్థాన్‌తో జరిగిన పోరులో కూడా ఈ 9 మిడిల్ ఓవర్లలో భారత్ 1 వికెట్ కోల్పోయి 62 పరుగులే చేసింది. శ్రీలంకపై మాత్రం 78 పరుగులు రాబట్టింది. ముఖ్యంగా స్లో బౌలర్లను ఎదుర్కొవడంతో భారత టాప్ ఆర్డర్ ప్లేయర్లు స్థాయికి తగ్గట్లు ఆడలేకపోయారని బీసీసీఐ అభిప్రాయపడింది. ప్రస్తుతం సమస్యల కంటే పరిష్కారాలపైనే దృష్టిసారించినట్లు బీసీసీఐ వర్గాలు తెలిపాయి.
టీ20 ప్రపంచకప్ కోసం సంజూ శాంసన్‌ను ఎంపిక చేయకపోవడంపై విమర్శలు వస్తుండటం వల్ల బీసీసీఐ స్పందించింది. రిషభ్ పంత్ స్థానంలో శాంసన్‌ను ఎంపిక చేస్తారనే వూహాగానాలు వినిపించాయి. ఐతే శాంసన్ పేరు సెలక్షన్ కమిటీలో అసలు చర్చకే రాలేదని తెలుస్తోంది. దక్షిణాఫ్రికాతో జరిగే వన్డే సిరీస్‌లో శాంసన్ ఆడతాడని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. టాప్‌ఆర్డర్‌లో పంత్ ఒక్కడే ఎడమ చేతి వాటం ఆటగాడని, తను చెలరేగే రోజు ఒంటి చేత్తో మ్యాచ్ గెలిపించగలడని బీసీసీఐ వర్గాలు తెలిపాయి.