భారత నియంత్రణ క్రికెట్ సంస్థ (బీసీసీఐ) వార్షిక సర్వసభ్య సమావేశంపై (BCCI AGM 2021) కార్యదర్శి జై షా (BCCI Secretary Jay Shah) స్పందించారు. కరోనా కారణంగా ఈ ఏడాది జరగాల్సిన మీటింగ్‌ను సెప్టెంబర్ 30కి ముందు నిర్వహించట్లేదని స్పష్టం చేశారు. తదుపరి తేదీని నిర్ణయించాక బీసీసీఐ అనుబంధ సంస్థలకు వెల్లడిస్తామని పేర్కొన్నారు.
తమిళనాడు ప్రభుత్వానికి సంబంధించిన ఓ ఉత్తర్వును కూడా జై షా లేఖలో పేర్కొన్నారు. కొవిడ్ మహమ్మారి ప్రబలంగా ఉన్న కారణంగా 2020-21కి సంబంధించి వార్షిక సర్వసభ్య సమావేశాలు సెప్టెంబర్ నుంచి డిసెంబర్‌కు మూడు నెలలు వాయిదా వేయాలని జారీ చేసిన జీవోను ఆయన ఉదహరించారు. జూన్ 30, 2021న జీవో నంబర్ 96 పేరుతో ఈ జీవోను తమిళనాడు ప్రభుత్వం జారీ చేసింది. ఈ ఉత్తర్వును దృష్టిలో ఉంచుకుని తాజా నిర్ణయం తీసుకున్నట్లు షా స్పష్టం చేశారు.