టీ20 ప్రపంచకప్‌లో(T20 World Cup 2021) టీమ్‌ఇండియాపై తమ జట్టు గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశాడు పాకిస్థాన్ సారథి బాబర్ ఆజామ్(Babar Azam on India). గత కొన్నేళ్లుగా యూఏఈలో ఆడిన అనుభవం తమ జట్టుకు బాగా ఉపయోగపడుతుందని అన్నాడు. ప్రస్తుతం తాము పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉన్నామని పేర్కొన్నాడు. 2016 నుంచి దుబాయ్ క్రికెట్ మైదానంలో పాకిస్థాన్ ఆరు మ్యాచ్‌లు అడింది. ఒక్క మ్యాచ్‌లోనూ ఓడిపోలేదు. ఈ నేపథ్యంలోనే బాబర్ ఈ వ్యాఖ్యలు చేశాడు.
"మొదటి మ్యాచ్‌లో ఒత్తిడి తీవ్రంగా ఉంటుంది. కానీ, ఈ మ్యాచ్‌లో మా జట్టే గెలుస్తుందని అనుకుంటున్నా. గత 3-4 ఏళ్ల నుంచి మేము యూఏఈలోనే క్రికెట్ ఆడుతున్నాం. అక్కడి పిచ్ పరిస్థితులు బాగా తెలుసు. ఆరోజు ఎవరు బాగా ఆడితే వారే గెలుస్తారు. గెలుపు మాత్రం పక్కా మాదే.ఇక ఈ ప్రపంచకప్‌లో రిజ్వాన్‌తో కలిసి ఓపెనింగ్ చేస్తాను. పరిస్థితులకు అనుగుణంగా జట్టులో మార్పులు చేసుకుంటాను. అలాగే మహ్మద్ హఫీజ్, షోయబ్ మాలిక్ వంటి సీనియర్లు మాతో ఉండటం టీమ్‌కు ఉపయోగం."
-- బాబర్ ఆజామ్, పాకిస్థాన్ జట్టు కెప్టెన్.
టీ20 ప్రపంచకప్‌లో పాక్ జట్టుకు(Pakistan Captain) సారథ్యం వహించడం ఆనందంగా ఉందని బాబర్ ఆజామ్ అన్నాడు. తమ జట్టు గతం గురించి ఆలోచించదని, భవిష్యత్ గురించి మాత్రమే ఆలోచిసస్తుందని తెలిపాడు. కాగా, టీ20 ప్రపంచకప్ చరిత్రలో భారత్, పాక్ ఇప్పటి వరకు ఐదుసార్లు తలపడగా అందులో నాలుగుసార్లు టీమ్‌ఇండియానే విజయం సాధించింది. ఒక మ్యాచ్ ఫలితం తేలలేదు.