Aus vs Nz World Cup 2023 : 2023 ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా వరుసగా నాలుగో విజయం నమోదు చేసింది. శనివారం ధర్మశాల వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్‌లో 5 పరుగుల తేడాతో ఆసీస్ నెగ్గింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్.. 49.2 ఓవర్లలో 388 పరుగులకు ఆలౌటైంది. అనంతరం భారీ లక్ష్య ఛేదనలో కివీస్ ధీటుగానే పోరాడింది. 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 383 పరుగులు చేసి.. త్రుటిలో విజయాన్ని చేజార్చుకుంది. ఛేదనలో రాచిన్ రవీంద్ర (116) సూపర్ సెంచరీతో అదరగొట్టగా.. డ్యారిల్ మిచెల్ (54) రాణించాడు. ఇక చివర్లో జెమ్మి నీషమ్ (58) తుపాన్ ఇన్నింగ్స్‌తో కివీస్ శిబిరంలో ఆశలు రేకెత్తించాడు. కానీ, ఆఖరి ఓవర్లో రనౌటవ్వడం వల్ల.. ఆసీస్ గెలుపు ఖరారైంది. ఆస్ట్రేలియా బౌలర్లలో ఆడమ్ జంపా 3, జోష్ హజెల్‌వుడ్ 2, ప్యాట్ కమిన్స్ 2, గ్లెన్ మ్యాక్స్‌వెల్ ఒక వికెట్ దగ్గించుకున్నారు. సెంచరీతో అదరగొట్టిన ఆసీస్ బ్యాటర్ ట్రావిస్ హెడ్‌కు 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు లభించింది. ఈ గెలుపుతో ఆసీస్ 8 పాయింట్లతో నాలుగో స్థానంలో కొనసాగుతోంది.
ఆరంభం నుంచే ఎటాక్..భారీ లక్ష్య ఛేదనలో కివీస్ ప్రారంభం నుంచే ఎటాకింగ్ గేమ్ స్టార్ట్ చేసింది. ఓపెనర్లు కాన్వే (28), విల్ యంగ్ (32) ఫర్వాలేదనిపించారు. తర్వాత రాచిన్ రవీంద్ర మెరుపు వేగంతో 77 బంతుల్లోనే సెంచరీ నమోదు చేశాడు. డ్యారిల్ మిచెల్ హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. ఇక రాచిన్ ఔటైన తర్వాత జెమ్మి నీషమ్ స్కోర్ బోర్డును ముందుకు నడిపించే బాధ్యతలు తీసుకున్నాడు. కానీ, అతడికి మరో ఎండ్‌లో సహకారం లేకపోవడం వల్ల ఒక్కడే పోరాడాల్సి వచ్చింది. ఆఖరి రెండు బంతుల్లో 7 పరుగులు కావాల్సిన దశలో.. నీషమ్ ఒక పరుగుతీసి రనౌటయ్యాడు. దీంతో ఆఖరి బంతికి 6 పరుగులు కావాల్సి వచ్చింది. కానీ స్టార్ ఆఖరి బంతిని డాట్‌గా మలిచి ఆసీస్‌కు విజయాన్ని కట్టబెట్టాడు.