Aus vs Ned World Cup 2023 :2023 వరల్డ్‌కప్‌లో ఆస్ట్రేలియామూడో విజయం నమోదు చేసింది. మెగాటోర్నీలో భాగంగా బుధవారం నెదర్లాండ్స్‌తో తలపడ్డ ఆస్ట్రేలియా.. 309 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 400 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో పసికూన నెదర్లాండ్స్.. తేలిపోయింది. పదునైన ఆసీస్ బౌలింగ్‌ను ఎదుర్కోలేక 21 ఓవర్లలో 90 పరుగులకు చేతులెత్తేసింది. 25 పరుగులు చేసిన విక్రమ్‌జిత్ సింగ్ జట్టులో టాప్‌స్కోరర్. ఆసీస్ బౌలర్లలో ఆడమ్ జంపా మరోసారి 4 వికెట్లతో మెరిశాడు. మిచెల్ మార్ష్ 2, కమిన్స్, హజెల్‌వుడ్, స్టార్క్ తలో వికెట్ పడగొట్టారు. మెరుపు శతకంతో అదరగొట్టిన మ్యాక్స్‌వెల్‌కు 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు లభించింది. ఈ విజయంతో ఆరు పాయింట్లతో ఆసీస్ పట్టికలో నాలుగో ప్లేస్‌లో కొనసాగుతోంది.
పసికూన టపటాపా..ఛేదనలో పసికూన నెదర్లాండ్స్.. ఆసీస్‌కు ఏమాత్రం పోటీ ఇవ్వలేకపోయింది. ఆరంభం నుంచే క్రమం తప్పకుండా వికెట్లు పారేసుకుంది. ఆసీస్ బౌలింగ్ దెబ్బకు డచ్ జట్టులో సగం మంది బ్యాటర్లు సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. స్పిన్నర్ ఆడమ్ జంపా దెబ్బకు నెదర్లాండ్స్ బ్యాటర్లు.. క్రీజులో నిలువలేకపోయారు.
మ్యాక్స్‌వెల్ అదుర్స్.. అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్.. నెదర్లాండ్స్‌పై దండయాత్ర చేసింది. తొలుత డేవిడ్ వార్నర్ శతకంతో చెలరేగగా.. స్టీవ్ స్మిత్, లబూషేన్ హాఫ్ సెంచరీలతో రాణించాకు. ఇక ఆఖర్లో మాత్రం మ్యాక్స్‌వెల్ ఆట మ్యాచ్‌కే హైలైట్. అతడు ఆకాశమే హద్దుగా చెలరేగి బౌండరీలతో డచ్ జట్టుపై విరుచుకుపడ్డాడు. ఆసీస్ ఇన్నింగ్స్‌లో 46.2 ఓవర్ల వద్ద ఫిఫ్టీ పూర్తి చేసుకున్న మ్యాక్స్‌వెల్.. 48.4 వద్ద 100 పరుగుల మార్క్ అందుకున్నాడంటే అతడి విధ్వసం ఏవిధంగా సాగిందో అర్థం చేసుకోవచ్చు. ఈ క్రమంలోనే 40 బంతుల్లో 100 పరుగులు పూర్తి చేసి.. వరల్డ్‌కప్ హిస్టరీలో ఫాస్టెస్ట్ సెంచరీ నమోదు చేశాడు. ఇక ఈ సెంచరీని.. ఇటీవల పుట్టిన తన కుమారుడికి అంకితం ఇచ్చాడు మ్యాక్స్‌వెల్.