Asia Cup 2023 IND Vs BAN : 2023 ఆసియా కప్ సూపర్ 4లో భాగంగా భారత్-బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న పోరులో.. బంగ్లా ఇన్నింగ్స్ ముగిసింది. నిర్ణీత 50 ఓవర్లలో బంగ్లా ఎనిమిది వికెట్ల నష్టానికి 265 పరుగులు చేసింది. బంగ్లా కెప్టెన్ షకీబల్ హసన్ (80 పరుగులు), హ్రిదోయ్ (54 పరుగులు) హాఫ్ సెంచరీలతో ఆకట్టుకున్నారు. చివర్లో ససుమ్ అహ్మద్ (44), మెహిదీ హసన్ (29) రాణించారు. భారత్ బౌలర్లలో శార్దూల్ ఠాకూర్ 3, మహమ్మద్ షమీ 2, ప్రసిద్ధ్ కృష్ణ, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా తలో వికెట్ పడగొట్టారు.
ఆరంభంలో తడబాటు..టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్‌కు మంచి ఆరంభం లభించలేదు. ఇన్నింగ్స్ మూడో ఓవర్లలోనే ఓపెనర్ లిట్టన్ దాస్(0)ను.. పేసర్ మహమ్మద్ షమీ క్లీన్ బౌల్డ్ చేశాడు. కొద్ది సేపటికే మరో ఓపెనర్ తన్జీద్ హసన్ (10)ను శార్దూల్ పెవిలియన్ చేర్చాడు. ఆ తర్వాత భారత బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేయడం వల్ల.. బంగ్లాదేశ్ పరుగులు చేయలేకపోయింది. 13.6 ఓవర్లకు బంగ్లా 59-4తో కష్టాల్లో పడింది.
ఆదుకున్న కెప్టెన్.. కీలకమైన నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన బంగ్లాను.. కెప్టెన్ షకీబ్ఆదుకున్నాడు. మిడిలార్డర్ బ్యాటర్ హ్రిదోయ్తో కలిసి (101 పరుగులు) శతక భాగస్వామ్యం నెలకొల్పాడు. వీరిద్దరూ భారత బౌలర్లను సమర్థంగా ఎదుర్కొన్నారు. ఇక చివర్లో అహ్మద్, మెహిదీ హసన్ రాణించడం వల్ల బంగ్లా పోరాడగలిగే స్కోర్ చేసింది.