రెండు వారాల్లో వెస్టిండీస్‌తో సిరీస్ ఆడనున్న టీమ్ఇండియా ఆ తర్వాత ఆసియా కప్‌లో పాల్గొననుంది. జులై 12 నుంచి ఆగస్టు 13 మధ్య జరిగే విండీస్ పర్యటనలో టీమ్ఇండియా రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీ20లు ఆడనుంది. ఆ తర్వాత ఆగస్టు 31 నుంచి ఆసియా కప్ జరగనుంది. పాకిస్థాన్, శ్రీలంక దేశాలు ఈ టోర్నీకి ఆతిథ్యం ఇస్తున్నాయి. అయితే, ఆసియా కప్ కోసం భారత జట్టును సెలెక్షన్ కమిటీ ఇంకా ప్రకటించలేదు. విండీస్‌తో వన్డే టూర్ ముగిసిన తర్వాత ఈ జట్టు ప్రకటన రానుంది. లేదంటే కీలక ఆటగాళ్లైన బుమ్రా, కేఎల్ రాహుల్ ఫిట్నెస్ నిరూపించుకుంటే.. వారితో కలిపి జట్టును ప్రకటించాలని బీసీసీఐ యోచిస్తున్నట్లు సమాచారం. ఆసియా కప్ ఆడే భారత జట్టే దాదాపుగా వన్డే ప్రపంచకప్‌లో ఆడే ఛాన్స్‌లు అధికంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ టోర్నీ కోసం ఎలాంటి జట్టును బీసీసీఐ సెలెక్షన్ కమిటీ ఎంపిక చేస్తుందోనని సర్వత్రా ఆసక్తి నెలకొంది.
ఓపెనర్లుగా వారే..
వన్డేలో టీమ్ఇండియా ఓపెనర్ల విషయంలో సమస్యే లేదు. సారథి రోహిత్ శర్మతో పాటు యువ సంచలనం శుభ్‌మన్ గిల్ ఇన్నింగ్స్ ఆరంభించడం దాదాపు ఖాయమే. ఇటీవలి కాలంలో టెస్టు, వన్డే, టీ20లలో శుభ్‌మన్ గిల్ సంచలన ప్రదర్శన చేస్తున్నాడు. ఐపీఎల్లో అతడే టాప్ స్కోరర్. దీంతో ఓపెనర్‌గా రోహిత్‌కు అతడే సరిజోడి. ఇక రిజర్వ్ ఓపెనర్‌గా రుతురాజ్ గైక్వాడ్ అందుబాటులో ఉంటాడు. మరో ఆటగాడు యశస్వీ జైస్వాల్ కూడా ఓపెనింగ్ స్థానంపైనే కన్నేస్తున్నాడు.
మిడిల్ పటిష్ఠం!
భారత జట్టులో మిడిలాడర్ ఆటగాళ్ల కొదవ లేదు. నిలబడితే భారీ స్కోరు చేసే స్టార్ ప్లేయర్లు అందుబాటులో ఉన్నారు. వన్‌డౌన్‌లో విరాట్ కోహ్లీ.. జట్టుకు అత్యంత కీలకం కానున్నాడు. అతడు ఫామ్‌లో ఉండటం టీమ్ఇండియాకు పెద్ద సానుకూలాంశం. ఒంటిచేత్తో జట్టును విజయతీరాలకు చేర్చడం కోహ్లీకి కొట్టిన పిండి. ఇక నాలుగో స్థానానికి కేఎల్ రాహుల్ గట్టి పోటీ ఇవ్వనున్నాడు. ఫిట్నెస్ సాధించి తుది జట్టులో చేరితే అతడు నాలుగో స్థానంలో ఆడటం ఖాయమే. గత మ్యాచ్‌లలో టీమ్ఇండియాకు అతడే కీపింగ్ చేస్తుండటం గమనార్హం.