Asia Cup 2023 Group Stage Best Knocks :2023 ఆసియా కప్ గతనెల 30న పాకిస్థాన్‌లో అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ సీజన్‌కు పాకిస్థాన్, శ్రీలంక ఆతిథ్యమిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఆరు జట్లతో మొదలైన ఈ టోర్నీలో గ్రూప్ దశ మంగళవారంతో ముగిసింది. రెండు గ్రూపుల్లో పాయింట్ల పట్టికలో చివరగా ఉన్న అఫ్గానిస్థాన్, నేపాల్ జట్లు ఇంటిబాట పట్టాయి. దీంతో మిగిలిన నాలుగు జట్లు సూపర్ 4 కు అర్హత సాధించాయి. అయితే గ్రూప్ దశలో జరిగిన మ్యాచ్‌ల్లో అద్భుత ప్రదర్శన చేసిన ఆటగాళ్లపై ఓ లుక్కేద్దాం..
1. మహమ్మద్ నబీ VS శ్రీలంక
అఫ్గానిస్థాన్ ఆల్‌రౌండర్ మహమ్మద్ నబీ.. శ్రీలంకపై అద్భుత ప్రదర్శన కనబరిచాడు. గ్రూప్ స్టేజ్‌లో ఆఖరి మ్యాచ్‌లో 292 పరుగుల లక్ష్య ఛేదనలో అఫ్గాన్.. రన్‌రేట్‌ను మెరుగుపర్చుకునేందుకు దూకుడుగా ఆడింది. ఈ క్రమంలో అఫ్గాన్ టపటపా వికెట్లు పారేసుకుంది.
అయితే రహమత్ షా ఔటైన తర్వాత 6 స్థానంలో క్రీజులోకి వచ్చిన నబీ.. లంక బౌలర్లపై విరుచుకుపడ్డాడు. కేవలం 24 బంతుల్లోనే అర్ధ శతకం బాదాడు. ఈ క్రమంలో వన్డేల్లో తక్కువ బంతుల్లో హాఫ్ సెంచరీ నమోదు చేసిన అఫ్గాన్ బ్యాటర్‌గా నిలిచాడు. ఇన్నింగ్స్‌లో 32 బంతులు ఎదుర్కొన్న నబీ.. 6 ఫోర్లు, 5 సిక్స్‌లతో 65 పరుగులు చేశాడు. కానీ పట్టు తప్పిన అఫ్గాన్ 37.4 ఓవర్లలో 289 ఆలౌటైంది. దీంతో శ్రీలంక సూపర్ 4కు దుసుకెళ్లింది.
2. బాబర్ అజామ్ VS నేపాల్
2023 ఆసియా కప్ ప్రారంభ మ్యాచ్‌లో పసికూన నేపాల్‌పై పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజామ్ బీభత్సం సృష్టించాడు. ఎడాపెడా బౌండరీలు బాదుతూ.. ఏకంగా 151 పరుగులు నమోదు చేశాడు. ఈ క్రమంలో ఆసియా కప్‌లో అత్యధిక పరుగులు చేసిన కెప్టెన్‌గా బాబర్ నిలిచాడు. ఇదివరకు ఈ రికార్డు టీమ్ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ పేరిట ఉండేది. అతడు 2014 ఆసియా కప్‌లో బంగ్లాదేశ్‌పై 136 పరుగులు చేశాడు.
3. ఇషాన్ కిషన్ VS పాకిస్థాన్
భారత్-పాకిస్థాన్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దైన విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్‌లో పాక్ పేసర్ల ధాటికి భారత్ 66 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. అప్పుడు క్రీజులోకి వచ్చిన పాకెట్ డైనమైట్ ఇషాన్ కిషన్.. హార్దిక్ పాండ్యతో జత కట్టాడు. వీరిద్దరూ 138 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి.. భారత్‌కు గౌరప్రదమైన స్కోర్ అందిచారు. ఈ క్రమంలో ఇషాన్.. పదునైన పాక్ బౌలింగ్‌ను తట్టుకొని వారికి ఎదురునిలిచాడు. 100 స్టైక్‌రేట్‌తో 82 పరుగులు చేసి ఔరా అనిపించాడు.
4. హార్దిక్ పాండ్య VS పాకిస్థాన్
పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో ఇషాన్‌తో కలిసిన హార్దిక్క్రీజులో నిలదొక్కుకున్నాడు. అనవసర షాట్లకు పోకుండా సింగిల్స్ తీస్తూ.. స్టైక్ రొటేట్ చేశాడు. ఈ క్రమంలో హార్దిక్ (87) కెరీర్లో 11వ అర్ధ శతకం నమోదు చేశాడు.
5. కుశాల్ మెండీస్ VS అఫ్గానిస్థాన్
అఫ్గానిస్థాన్‌తో జరిగిన గ్రూప్ స్టేజ్ చివరి మ్యాచ్‌లో శ్రీలంక బ్యాటర్ కుశాల్ మెండీస్.. 109 స్టైక్‌రేట్‌తో 92 పరుగులు చేశాడు. ఇక ఇన్నింగ్స్ 39 ఓవర్లో, అఫ్గాన్ ఆల్‌రౌండర్ రషీద్ ఖాన్ అద్భుతమైన త్రో విసిరి.. మెండీస్‌ను పెవిలియన్ చేర్చాడు. దీంతో మెండీస్ 8 పరుగుల తేడాతో సెంచరీని మిస్ చేసుకున్నాడు.