తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఆసియా కప్​లో భారత్​ వైఫల్యానికి కారణాలివే! - టీమ్​ ఇండియా పెర్ఫామెన్స్ రివ్యూ

Asia Cup 2022 India : ఆసియా కప్‌లో భారత జట్టు ధనాధన్ విజయాలతో దూసుకెళ్తుందని భావించినా గ్రూప్‌ దశలోనే నిష్క్రమించి అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది. ఐపీఎల్‌లో ప్రత్యర్థులకు చుక్కలు చూపించిన బ్యాటర్లు, బౌలర్లు ఉండటం వల్ల టీమ్​ ఇండియా కప్‌ సాధించటం ఖాయమని అంతా భావించారు. కానీ ఎప్పటిలాగే కీలక మ్యాచుల్లో బ్యాటింగ్‌, బౌలింగ్‌ విభాగాల్లో విఫలమై ఆసియా కప్‌ నుంచి నిష్క్రమించింది. ఆసియా కప్‌లో భారత ఆటగాళ్లలో ఎవరి ప్రదర్శన ఎలా ఉంది? టీ-20 ప్రపంచకప్‌నకు ముందు జరిగిన చివరి అతిపెద్ద టోర్నీలో భారత జట్టు వైఫల్యంపై నిపుణుల విశ్లేషణ చూద్ధాం.

Asia Cup 2022 India
Asia cup 2022 India overall review

By

Published : Sep 9, 2022, 10:22 PM IST

Asia Cup 2022 India : అంతర్జాతీయ క్రికెట్ లీగ్‌లో భారత్‌ మరోసారి తడపడింది. దుబాయి వేదికగా జరుగుతున్న ఆసియా కప్‌లో టీమ్‌ ఇండియా స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేక సూపర్‌-4 దశలోనే నిష్క్రమించింది. అయితే సుదీర్ఘకాలం తర్వాత విరాట్‌ కోహ్లీ ఆడిన శతక ఇన్నింగ్స్‌ ఆసియా కప్‌లో భారత్‌ వైఫల్యాలను కనిపించకుండా చేసింది. కానీ, ఆఫ్గానిస్థాన్‌పై విరాట్‌ చేసిన శతకానికి అంత ప్రాధాన్యం ఉందా అని క్రీడా విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు.నామమాత్రపు మ్యాచ్‌లో విరాట్ సెంచరీ చేయడం వల్ల టీమ్‌ ఇండియాకు ఓనగూరిన ప్రయోజనం ఏమిటని అభిప్రాయపడుతున్నారు. పాకిస్థాన్​తో మ్యాచ్‌ జరిగిన మరుసటి రోజే ఆప్గాన్‌ ఆటగాళ్లు టీమ్‌ఇండియాతో ఆడటం ఆ జట్టు ప్రదర్శనపైనే తీవ్ర ప్రభావం చూపిందని విశ్లేషిస్తున్నారు. టీమ్‌ఇండియాతో ఆడేందుకు ఆఫ్గాన్‌ ఆటగాళ్లు మానసికంగా, శారీరకంగా పూర్తి స్థాయిలో సిద్ధం కాలేదని అభిప్రాయపడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో విరాట్‌ చేసిన శతకం, భారత్‌ సాధించిన ఘన విజయం పరిగణలోకి తీసుకునేదేనా అని ప్రశ్నిస్తున్నారు.

మిడిలార్డర్ సమస్య..:ఆసియా కప్‌ టీమ్‌ ఇండియాలోని పలు లోపాలను బహిర్గతం చేసింది. ముఖ్యంగా భారత ఓపెనర్లు రోహిత్‌ శర్మ, కేఎల్‌ రాహుల్‌ ఆశించిన మేర పరుగులు చేయలేదు. అటు విరాట్‌ కోహ్లీ సైతం అప్గాన్‌తో మ్యాచ్‌ మినహా.. టోర్నీలో మునుపటి సాధికారతను ప్రదర్శించలేకపోయాడు. కేఎల్‌ రాహుల్‌ అఫ్గాన్‌తో మ్యాచ్‌లో ఫామ్‌లోకి వచ్చినట్లు కనిపించినా అది తర్వాతి మ్యాచులలోనూ కొనసాగిస్తాడా లేదా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. అటు మిడిలార్డర్‌ సమస్య ఆసియా కప్‌లోనూ భారత్‌ను వెంటాడింది. రిషభ్‌ పంత్‌, దినేశ్‌ కార్తిక్‌లకు మిడిలార్డర్‌లో అవకాశాలు ఇచ్చినప్పటికీ.. వారు తమదైన ముద్ర వేయలేకపోయారు. ముఖ్యంగా రిషబ్‌ పంత్‌ అదే పేలవమైన షాట్లతో వికెట్లను సమర్పించుకొని జట్టు విజయానికి ఏ మాత్రం కృషి చేయలేకపోయాడు. దినేశ్‌ కార్తిక్‌ భారత్‌ ఆడిన ఐదు మ్యాచ్‌లలో మూడింటిలో ఉన్నప్పటికీ.. అతడు పట్టుమని 10 బంతులను కూడా ఎదుర్కొలేకపోయాడు. దీంతో దినేశ్‌ కార్తిక్‌ ప్రదర్శనపై సందిగ్దం నెలకొంది.

బౌలర్ల వైఫల్యం..:ఆసియా కప్‌లో బౌలర్ల వైఫల్యం జట్టు విజయాలను తీవ్రంగా దెబ్బతీశాయి. ముఖ్యంగా ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా గాయపడి సిరీస్‌కు దూరం కావడం జట్టు విజయ అవకాశాలను తీవ్రంగా ప్రభావితం చేసింది. జడేజా స్థానంలో అక్షర్‌ పటేల్‌కు స్థానం చోటు దక్కినప్పటికీ అతడు జడేజా అంత ప్రభావం చూపలేకపోయాడు. అఫ్గాన్‌ మ్యాచ్‌ మినహా.. భువనేశ్వర్‌ కుమార్‌ ఆశించిన మేర రాణించలేకపోయాడు. పాకిస్థాన్‌, శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లలో భువనేశ్వర్‌ విఫలమయ్యాడు. ముఖ్యంగా 19వ ఓవర్‌లో భారీగా పరుగులు సమర్పించి జట్టు ఓటమికి కారణమైనట్లు క్రీడా నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఈ నేపథ్యంలో భవిష్యత్‌ మ్యాచ్‌ల్లో భువీ ఏమేర రాణిస్తాడన్న సందేహాన్ని నిపుణులు వ్యక్తం చేస్తున్నారు. అటు మరో భారత బౌలర్‌ అవేశ్‌ఖాన్‌ సైతం ఆసియా కప్‌లో దారుణంగా విఫలమయ్యాడు. అయితే అర్షదీప్‌ సింగ్‌ మాత్రం తనదైన బౌలింగ్‌తో అందరి దృష్టిని ఆకర్షించాడు

ఇవీ చదవండి:విరాట్​ సెంచరీతో అనుష్క ఫుల్ ఖుష్.. ఇన్​స్టాలో లవ్​ నోట్​

కోహ్లీ సెంచరీపై స్పందించిన రషీద్​ ఖాన్​.. ఏమన్నాడంటే

ABOUT THE AUTHOR

...view details