Abdul Razzaq Apology : బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ కోడలు, బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఐశ్వర్యారాయ్ బచ్చన్‌పై పాకిస్థాన్ మాజీ క్రికెటర్ అబ్దుల్ రజాక్ అసభ్యకర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే అతడి కామెంట్స్‌పై పెద్ద ఎత్తున విమర్శలు వెలువెత్తాయి. దీంతో తన మాటలను వెనక్కి తీసుకుంటూ క్షమాపణలు కోరుతున్నట్లు ఓ టీవీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపాడు రజాక్.
"నిన్న నేను ఓ టీవీ కార్యక్రమంలో పాల్గొన్నాను. అక్కడు క్రికెట్ కోచింగ్, దాని ఉద్దేశాలను గురించి మాట్లాడాను. నోరుజారి ఐశ్వర్యారాయ్ పేరును ప్రస్తావించాను. ఆమెకు నేను వ్యక్తిగతంగా క్షమాపణలు చెబుతున్నాను. ఎవరి మనోభావాలను దెబ్బతీయాలనే ఉద్దేశం నాకు లేదు."
- అబ్దుల్ రజాక్
అసలేం ఏం అన్నాడు?
Abdul Razzaq Aishwarya Rai : ఇటీవలే పాక్‌కు చెందిన ఓ టీవీ ఛానల్ చిట్‌చాట్ షోలో పాల్గొన్నాడు అబ్దుల్ రజాక్. అతడితో పాటు ఇతర మాజీలు సైతం ఆ కార్యక్రమానికి హాజరయ్యారు. అయితే అక్కడే ఉన్న విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తున్న సమయంలో రజాక్ నోరు జారాడు. పాకిస్థాన్ టీమ్ పేలవ ప్రదర్శన, అందుకు గల కారణాలను వివరిస్తూ పాకిస్థాన్ క్రికెట్ బోర్డును తప్పుబడుతున్న సమయంలో మధ్యలో ఐశ్వర్య రాయ్ పేరును ప్రస్తావించి వివాదస్పద వ్యాఖ్యలు చేశాడు.
'అసలు క్రికెట్ బోర్డు(పీసీబీ) సంకల్పమే బలంగా లేదు. పాకిస్థాన్‌లో క్రికెటర్ల సామర్థ్యానికి పదును పెట్టాలన్న ఉద్దేశమే వారిలో కనిపించడం లేదు. అలాంటప్పుడు మంచి ఫలితాలు ఎలా ఆశించగలము. నేను ఐశ్వర్య రాయ్‌ని పెళ్లి చేసుకున్నంత మాత్రాన అందమైన, పవిత్రమైన పిల్లలు పుట్టరు కదా. ముందు సంకల్పం దృఢంగా ఉండాలి' అని సంబంధం లేని విషయాన్ని తమ క్రికెట్ బోర్డుతో పోల్చుతూ ముడి పెట్టాడు రజాక్. ఈ సెన్సెషనల్ కామెంట్స్‌నే తోటి క్రికెటర్లు, నెటిజన్లు తప్పుపట్టడం వల్ల రజాక్ చివరకి క్షమాపణలు చెప్పక తప్పలేదు.
వెక్కిలిగా నవ్వాడు.. క్షమాపణలు చెప్పాడు..!
Shahid Afridi News : అయితే రజాక్ చేసిన వ్యాఖ్యలకు అదే కార్యక్రమంలో అతడి పక్కన కూర్చున మరో మాజీ ప్లేయర్ షాహిద్ అఫ్రిది నవ్వుతూ చప్పట్లు కొట్టాడు. ఈ వీడియో క్లిప్‌ను చూసిన కొందరు అఫ్రిదిని కూడా తప్పుబట్టారు. దీంతో అతడు కూడా క్షమాపణలు చెప్పాల్సిన పరిస్థితి ఏర్పిడింది.
ఇదేం కొత్త కాదు..!
మహిళలపై ఇలా వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం రజాక్‌కు ఇదేం తొలిసారి కాదు. 2021లో కూడా పాక్‌కు చెందిన మహిళా క్రికెటర్ నిదా దార్‌పై సైతం ఈ తరహా వ్యాఖ్యలు చేసి తీవ్ర స్థాయిలో విమర్శలు ఎదుర్కొన్నాడు. అప్పట్లో టీవీ కార్యక్రమంలో రజాక్‌తో పాటు ఆ దేశ మహిళా క్రికెట్ జట్టు ఆల్‌రౌండర్ నిదా దార్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా క్రీడల్లో స్త్రీల ప్రాముఖ్యత అంశంపై చర్చ రాగా.. రజాక్ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశాడు. 'మహిళలు క్రికెటర్లుగా మారితే.. పురుషులతో సమానంగా ఉండాలనుకుంటారు. లేదా ఇంకా మెరుగ్గా ఉండాలనుకుంటారు. పురుషులే కాదు తామూ కూడా బాగా ఆడతామని నిరూపించుకోవాలని చూస్తారు. దాంతో వాళ్లు అత్యుత్తమ క్రీడాకారులుగా ఎదిగేసరికి వివాహం చేసుకోవాలనే ఆశ సన్నగిల్లుతుంది. ఇప్పుడు నిదాకు షేక్ హ్యాండిస్తే మహిళ అనే ఫీలింగ్ కూడా నాకు కలగదు' అని రజాక్ అన్నాడు.
బ్లాక్ డ్రెస్‌లో 'ప్రేమమ్' భామ - తెలుగులో మళ్లీ ఎప్పుడు కనిపిస్తావమ్మా!
ఐశ్వర్య రాయ్‌పై పాక్ మాజీ క్రికెటర్ అనుచిత వ్యాఖ్యలు- నెటిజెన్స్ ఫైర్!